చిత్రం న్యూస్, ఆదిలాబాద్: బహుభాషా పండితులు, హిందీ భాషా సేవా సమితి జిల్లా అధ్యక్షులు, అఖిల భారతీయ మాలీ మహా సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన సాహితీవేత్త, హిందీ పండితులు సుకుమార్ పెట్కులే, బహుభాషా కోవిదుడు రిటైర్డ్ పోస్ట్ మాస్టర్, ప్రముఖ కవి ఆదిలాబాద్ పట్టణంలోని పిట్టలవాడకు చెందిన మధు బావలకర్ లకు సాహిత్య సామాజిక రంగాల్లో విశేష కృషి చేసినందుకు “భారతీయ సవిధాన్ సన్మాన గౌరవ పురస్కారం 2025” ఇరువురు సాహితీ వేత్తలకు తెలంగాణ నుండి అది కూడా అదిలాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన వారికి లభించింది. ఆదివారం సాయంత్రం మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా భద్రావతి లో ఈ పురస్కారాలను కార్యక్రమ నిర్వాహకులు జాతీయ మానవ హక్కుల సంఘం జాతీయ అధ్యక్షులు శివదాస్ మహాజన్ , పూణే కి చెందిన సత్యశోధక్ రఘునాథ్ ఢోక్, సంవిధాన్ సన్మానం గౌరవ సమితి ముఖ్య నిర్వాహకులు ఆనంద భగత్ లు అందజేశారు. పంచశీల కండువా, జ్ఞాపికతో పాటు ప్రశంసా పత్రము అందజేసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సాహితివేత్త మధు బావల్కర్, సుకుమార్ పెట్కులే లు మాట్లాడుతూ.. సాహిత్య, సామాజిక రంగంలో చేసిన కృషికి గాను ఈ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉందని ఇదే స్ఫూర్తితో మును ముందు సాహితీ సేవ చేస్తూ సమాజ సేవలో బహుజన మహనీయుల బాటలో నడుస్తామని అన్నారు.

