చిత్రం న్యూస్, ఆదిలాబాద్: భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ 141వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. డీసీసీ అధ్యక్షులు నరేష్ జాదవ్, తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి, మాజీ డీసీసీ అధ్యక్షులు సాజిద్ ఖాన్, టీపీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి గండ్రత్ సుజాత, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ అల్లూరి సంజీవ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ముందుగా మహాత్మ గాంధీ, జవహర్ లాల్ నెహ్రు, ఇందిరాగాంధీ చిత్రపటాలకు పూలమాలలు వేసి, కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం గాంధీ చౌక్ లో మహాత్ముడి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఉపాధిహామీ పథకానికి మహాత్మాగాంధీ పేరు మార్చడాన్ని నిరసిస్తూ ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ.. దేశ చరిత్రలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న విశిష్ట స్థానాన్ని, త్యాగాలను గుర్తుచేశారు. కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని రద్దుచేయడం అన్యాయమని నేతలు పేర్కొన్నారు. తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరుగుతున్న ఈ ఆవిర్భావ దినోత్సవం మరింత ప్రత్యేకమైనదని, కార్యకర్తల శ్రమ వల్లే ఈ విజయం సాధ్యమైందని తెలిపారు.

