_అర్హతలేని వైద్యులపై కఠిన చర్యలు..జైనథ్ సీఐ జి శ్రావణ్ కుమార్
చిత్రం న్యూస్, బేల: అర్హత లేకుండా RMP డాక్టర్‌గా చలామణి అవుతూ.. హైడోస్ ఇంజక్షన్లు ఇచ్చిన కారణంగా వృద్ధ మహిళ మృతి చెందిన ఘటనలో నిందితుడిని అరెస్టు చేశామని జైనథ్ సీఐ జి. శ్రావణ్ కుమార్ తెలిపారు. వివరాల్లోకి వెళితే.. బేల మండలం ఇందిరానగర్‌కు చెందిన ఉర్వతే శాంతాబాయి (65) అనే వృద్ధ మహిళకు ఛాతి నొప్పి, తల తిరుగుడు ఉందని చెప్పగా అర్హత లేకున్నప్పటికీ నకిలీ rmp లక్ష్మణ్ అనే వ్యక్తి ఆమెకు ఇంజక్షన్లు గోలీలు ఇచ్చినట్లు విచారణలో వెల్లడైంది. అనంతరం ఆమె అస్వస్థతకు గురై కింద పడిపోవడం108 అంబులెన్స్ ద్వారా అదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై నమోదైన Cr. No. 230/2025 U/Sec 105 BNS of PS Bela కేసులో విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడు అర్హత లేకుండా గత 15 ఏళ్లుగా RMP డాక్టర్‌గా చలామణి అవుతూ అమాయక ప్రజలకు హైడోస్ ఇంజక్షన్లు ఇస్తూ అక్రమంగా డబ్బులు సంపాదిస్తున్నట్లు గుర్తించారు. విచారణలో నిందితుడి వద్ద నుండి ఉపయోగించిన సిరంజీలు, ఇంజక్షన్లు, గోలీలను స్వాధీనం చేసుకొని పంచనామా నిర్వహించామన్నారు. గతంలో కూడా ఇతనిపై ఇలాంటి కేసులు నమోదు అయినట్లు పోలీసుల దర్యాప్తులో తేలిందన్నారు.ఈ కేసులో నిందితుడిని అరెస్ట్ చేసిన జైనథ్ సీఐ శ్రావణ్, బేల పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆభినందించారు.
ప్రజలకు పోలీసుల సూచన: ప్రజలు తమ ఆరోగ్య సమస్యల విషయంలో తప్పనిసరిగా ప్రభుత్వ లేదా గుర్తింపు పొందిన అర్హత కలిగిన వైద్యుల వద్ద మాత్రమే చికిత్స పొందాలని, అర్హతలు లేని వ్యక్తుల వద్ద ఇంజక్షన్లు, మందులు తీసుకోవద్దని పోలీస్ శాఖ సూచిస్తోంది. అనధికార వైద్య చర్యలు గమనించినట్లయితే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలన్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ అక్రమ వైద్య చర్యలకు పాల్పడుతున్నవారిని, అర్హతలేని వైద్యులపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.
