చిత్రం న్యూస్, కడెం: నిర్మల్ జిల్లా కడెం మండల ఉప సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడితో పాటు మండల కమిటీని ఉప సర్పంచ్‌లు ఎన్నుకున్నారు. బుధవారం కడెం మండల కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో ఈ ఎన్నికలు జరిగాయి. ఈ సమావేశంలో కొండుకూర్ గ్రామ ఉప సర్పంచ్ పొద్దుటూరి సంపత్ రెడ్డిని కడెం మండల ఉప సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షురాలిగా లింగాపూర్ గ్రామ ఉప సర్పంచ్ కమ్మల లక్ష్మిని, గౌరవ అధ్యక్షురాలిగా నాగవత్ సరితను ఎన్నుకున్నారు. ప్రధాన కార్యదర్శులుగా మద్దిపడగ గ్రామ ఉప సర్పంచ్ బండారి జనార్దన్, పాండవపూర్ గ్రామ ఉప సర్పంచ్ గొర్రె మధుకర్‌లను, కార్యదర్శిగా ఎలగడప గ్రామ ఉప సర్పంచ్ రాపర్తి శ్రీనివాస్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండలంలో మొత్తం 29 మంది ఉప సర్పంచ్‌లు ఉండగా, ఈ సమావేశానికి 25 మంది హాజరయ్యారు. మిగతా ఉప సర్పంచ్‌లు పలు కారణాల వల్ల సమావేశానికి హాజరు కాలేకపోయారు. నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు సంపత్ రెడ్డి, కమిటీ సభ్యులకు మెజారిటీ ఉప సర్పంచ్‌లు శాలువాలు కప్పి ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా అధ్యక్షుడిగా ఎన్నికైన సంపత్ రెడ్డి మాట్లాడుతూ, తనపై నమ్మకం ఉంచి మండల ఉప సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడిగా ఎన్నుకున్న మండలంలోని అన్ని గ్రామాల ఉప సర్పంచ్‌లకు పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. ఉప సర్పంచ్‌ల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మండలంలోని వివిధ గ్రామాల ఉప సర్పంచ్‌లు పాల్గొన్నారు.
