చిత్రం న్యూస్, బేల: ఆదిలాబాద్ నియోజకవర్గం బేల మండలం సాంగిడి గ్రామంలో సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డ్ మెంబర్ల ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని పురస్కరించుకొని, నూతనంగా బాధ్యతలు స్వీకరించబోయే సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులను శాలువా కప్పి సత్కరించారు. ప్రత్యేక అధికారి మనోహర్ రావు, గ్రామ కార్యదర్శి వేణుగోపాల్ రావు సమక్షంలో సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం నూతన గ్రామ పంచాయతీ పాలకవర్గం బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా మంచాల భూపతిరెడ్డి మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధిలో సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డ్ మెంబర్లు కీలక పాత్ర పోషిస్తారని, ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా గ్రామంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి, పారదర్శక పాలన, సమగ్ర గ్రామాభివృద్ధి దిశగా కృషి చేస్తామన్నారు. ప్రభుత్వం హయాంలో గ్రామాలు అభివృద్ధి పథంలో ముందుకు సాగాయని, అదే స్పూర్తితో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తూ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామన్నారు. గ్రామాభివృద్ధే లక్ష్యంగా సమష్టి కృషితో ముందుకు వెళతామన్నారు. ఉప సర్పంచ్ జిమ్మ శేఖర్, గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

