450 మందికి ఉచితంగా పరీక్షలు నిర్వహించిన వైద్యులు కళ్ళెం జీవిత వెంకట్ రెడ్డి దంపతులు
చిత్రం న్యూస్, జైనథ్: కళ్ళెం భూమా రెడ్డి హాస్పిటల్, వికాస తరంగిణి (చిన్నజీయర్ స్వామి వారి బృందం) సౌజన్యంతో గ్రామ సర్పంచ్ గడ్డం మమత జగదీష్ రెడ్డి ఆధ్వర్యంలో జైనథ్ గ్రామంలో ఆదివారం నిర్వహించిన మెగా ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. ఈ శిబిరంలో సుమారు 450 మంది గ్రామస్తులు పాల్గొని ఉచిత వైద్య సేవలు పొందారు. వైద్యులు జీవిత వెంకటరెడ్డి దంపతులు గ్రామస్తులకు బీపీ, షుగర్, గుండె సంబంధిత వ్యాధిగ్రస్తులకు ఈసీజీ పరీక్షలతో పాటు ఇతర సాధారణ పరీక్షలు చేపట్టారు. మహిళలకు బ్రెస్ట్ స్క్రీనింగ్ పరీక్షలు, గర్భిణులకు పరీక్షలు నిర్వహించారు. మందులను ఉచితంగా అందజేశారు. నూతనంగా ఎన్నికైన గ్రామ సర్పంచ్ గడ్డం మమత జగదీష్ రెడ్డి దంపతులను, ఉప సర్పంచ్ సంతోష్ , వార్డు సభ్యులను, వికాస తరంగిణి సభ్యులు రాజేశ్వర్ రావు, హన్మంత్ రావు లను వైద్యులు కళ్ళెం జీవిత వెంకట్ రెడ్డి దంపతులు సన్మానించారు. జైనథ్ ఆలయ చైర్మన్ రుకేష్ రెడ్డి, మార్కెట్ చైర్మన్ అశోక్ రెడ్డి, గ్రామ సర్పంచ్ గడ్డం మమత జగదీష్ రెడ్డి, వార్డు సభ్యులు కలిసి కళ్ళెం జీవిత వెంకట్ రెడ్డి దంపతులను పూలమాల, శాలువాతో ఘనంగా సన్మానించారు. శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి చిత్ర పటాన్ని అందజేశారు. అంతకుముందు చినజీయరు స్వామి చిత్ర పటానికి పూజలు నిర్వహించారు. జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా డా. కళ్ళెం వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. గ్రామ ప్రజల ఆరోగ్య సంరక్షణ లక్ష్యంగా నిర్వహించిన ఈ ఉచిత వైద్య శిబిరం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారన్నారు. ఇటువంటి సేవా కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా కొనసాగిస్తామని ఆయన పేర్కొన్నారు.

