పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులకు మహిళలు బుద్ది చెప్పండి
చిత్రం న్యూస్: బేల: స్థానిక పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులకు మహిళలు బుద్ది చెప్పండని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పార్టీ శ్రేణులతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. స్థానిక సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ పార్టీ బలపరిచిన అభ్యర్థులు ప్రచారానికి వస్తే మీకు ఓటు ఎందుకు వెయ్యాలని మహిళలు గట్టిగ నిలదీయాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు గడుస్తున్నా ఇచ్చినట్టు వంటి హామీలు అమలు చేయలేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 420 దొంగ హామీలు ఇచ్చి మహిళలకు మోసం చేసిందన్నారు. కళ్యాణలక్ష్మి పథకంలో బంగారం, సబ్సిడీ గ్యాస్, మహిళలకు రూ.2,500, చదువుకునే యువతులకు స్కూటర్ ఇలా అనేక దొంగ హామీలు ఇచ్చినందుకు ఓటు వేయాలా అని ప్రభుత్వానికి మహిళలు సూటిగా అడగాలని పేర్కొన్నారు. అదేవిదంగా కేంద్ర ప్రభుత్వం కూడా రైతుల పత్తి, సోయా పంటలను కొనుగోలు చేయలేక రైతులకు మోసం చేసిందని మండిపడ్డారు. రైతులు పంటలను మార్కెట్ యార్డ్ కు తీసుకొచ్చి పడిగాపులు కాస్తున్నారని దీనికి స్థానిక ఎంపీ ఏంచేస్తున్నారని… దీనికి సమాధానం ఎంపీ చెప్పాలని కోరారు. ఈ రెండు సంవత్సరాల కాలంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసింది ఏమిలేదని అందుకే స్థానిక ఎన్నికల్లో వారికీ గట్టిగా బుద్ది చెప్పి బీఆర్ఎస్ పార్టీకి చెందిన అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ మాజీ చైర్మన్ రావుత్ మనోహర్, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కళ్లెం ప్రమోద్ రెడ్డి, అడనేశ్వర్ ఫౌండేషన్ ఛైర్మన్ సతీష్ పవార్, నాయకులు మధుకర్, ఠాక్రే గంభీర్, మాజీ ఎంపీటీసీ గోడే మధుకర్, కన్నల మహేందర్ తదితరులు పాల్గొన్నారు.

