Chitram news
Newspaper Banner
Date of Publish : 16 November 2025, 8:50 pm Editor : Chitram news

తరోడ నూతన బ్రిడ్జి నిర్మాణ పనులకు భూమిపూజ 

తొలగనున్న తరోడ బ్రిడ్జి వద్ద రాకపోకల ఇబ్బందులు

రూ.12 కోట్లతో వంతెన నిర్మాణానికి ఎంపీ, ఎమ్మెల్యే భూమిపూజ

చిత్రం న్యూస్, భోరజ్: ఆదిలాబాద్ జిల్లాతో పాటు పక్కనే ఉన్న మహారాష్ట్ర ప్రజలు తరోడ వంతెన వద్ద పడుతున్న రాకపోకల ఇబ్బందులు ఎట్టకేలకు తొలగనున్నాయి. ఎన్నో ఏళ్లుగా ప్రజలు ఎదురుచూస్తున్న నూతన బ్రిడ్జి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ మేరకు ఎంపీ గోడం నగేష్ తో కలిసి ఎమ్మెల్యే పాయల్ శంకర్ రూ.12 కోట్లతో నిర్మించే తరోడ బ్రిడ్జి నిర్మాణానికి ఆదివారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తరోడ పాత వంతెన బీటలు వారి కూల్చివేయగా..అదే స్థానంలో పూర్తి కేంద్ర ప్రభుత్వం నిధులు రూ. 12 కోట్లతో నూతన వంతెన నిర్మాణానికి భూమి పూజ చేయడం జరిగిందన్నారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఇన్ని సంవత్సరాలు ప్రజలు ఇబ్బందులు పడ్డారని గుర్తు చేశారు. ఇటీవల జిల్లాలో కురిసిన అకాల భారీ వర్షాల కారణంగా వంతెన నిర్మాణ పనులు ఆలస్యంగా మొదలు పెట్టాల్సి వచ్చిందన్నారు. ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాన్ని కల్పించేందుకు భవిష్యత్తులో ఈ 353 బీ జాతీయ రహదారిని నాలుగు వరుసల రహదారిగా మార్చేందుకు కృషి చేయనున్నట్లు తెలిపారు. ఈ నూతన వంతెన నిర్మాణ పనులు రానున్న మే మాసంలోగా పూర్తిచేసేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో బీజేపీ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎల్టి అశోక్ రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ బోయర్ విజయ్,  జైనథ్ మండల అధ్యక్షుడు లోక కరుణాకర్ రెడ్డి, భోరజ్ మండల అధ్యక్షుడు గాజుల సన్నీ, మాజీ జడ్పీటీసీ సభ్యుడు తాటిపెల్లి రాజు, మాజీ సర్పంచ్ గజానన్, అధికారులు తదితరులు పాల్గొన్నారు