చిత్రం న్యూస్, బోథ్ : బోథ్ పోలీస్ సబ్‌డివిజన్ పరిధిలోని బజార్ హత్నూర్ గ్రామ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ దుర్మరణం చెందిన ఘటనలో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు బోథ్ సీఐ గురు స్వామి తెలిపారు. ఎస్ఐ శ్రీ సాయితో కలిసి వివరాలు ఆయన వెల్లడించారు. ఈ నెల 9న సాయంత్రం సుమారు 6:30 గంటలకు బజార్ హత్నూర్ గ్రామానికి చెందిన చేవుల రత్నమాల (48) తన కుమారుడు చేవుల లక్ష్మణ్ (22) తో కలిసి వ్యవసాయ పనులు ముగించుకొని ఎడ్లబండిపై గ్రామానికి వెళ్తుండగా..అదే సమయంలో తరడపు ప్రదీప్ కుమార్ అనే వ్యక్తి తన కారును మద్యం మత్తులో అత్యంత నిర్లక్ష్యంగా, వేగంగా నడుపుతూ గ్రామ శివారులో ఎడ్లబండిని ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో బాధితురాలు చేవుల రత్నమాల గాయాలతో అక్కడికక్కడే మరణించగా.. కుమారుడు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మద్యం తాగి వాహనాన్ని నిర్లక్ష్యంగా నడిపినట్లు నిర్ధారణ కావడంతో బోథ్ సీఐ గురు స్వామి పర్యవేక్షణలో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించారు.
