Chitram news
Newspaper Banner
Date of Publish : 10 November 2025, 10:55 am Editor : Chitram news

తెలంగాణకు చలి హెచ్చరిక: రాబోయే పది రోజులు గజగజే!

చిత్రం న్యూస్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో చలి తీవ్రత గణనీయంగా పెరగనుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. నవంబర్ 11 నుండి 19 వరకు, ముఖ్యంగా నవంబర్ 13 నుండి 17 మధ్య కాలంలో, రాష్ట్రవ్యాప్తంగా బలమైన శీతల వాతావరణం ఉండే అవకాశం ఉంది. ఇది గత ఏడేళ్లలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోవచ్చని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. సుమారు 8 నుండి 10 రోజుల పాటు చలి ప్రభావం అధికంగా ఉండనుంది.

మ్యాప్‌లో పింక్ రంగుతో గుర్తించిన ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కుము రంభీం, జగిత్యాల, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి వంటి జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కు (10°C కంటే తక్కువ) పడిపోవచ్చు. బ్లూ రంగుతో గుర్తించిన హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో ఉదయం ఉష్ణోగ్రతలు 11°C నుండి 14°C మధ్య నమోదయ్యే అవకాశం ఉంది.

గ్రీన్ రంగుతో గుర్తించిన దక్షిణ, తూర్పు తెలంగాణ జిల్లాల్లో (ముఖ్యంగా ఆంధ్ర సరిహద్దు ప్రాంతాల్లో) ఉష్ణోగ్రతలు 14°C నుండి 17°C వరకు నమోదు అయ్యే అవకాశం ఉంది.

చలి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు, అధికారులు సూచిస్తున్నారు. వృద్ధులు, చిన్నపిల్లలు, అనారోగ్యంతో ఉన్నవారు చలి నుండి రక్షణ పొందేందుకు వెచ్చని దుస్తులు ధరించడం ఉత్తమం.