చిత్రం న్యూస్, బేల: అపరిచిత వ్యక్తులతో జాగ్రత్త వహించాలని జైనథ్ సీఐ శ్రావణ్ కుమార్ అన్నారు. పోలీసులు మీకోసం కార్యక్రమంలో భాగంగా బేల మండలంలోని మశాల (బి)లో సైబర్ క్రైమ్ పై గ్రామస్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అపరిచిత వ్యక్తులు ఫోన్ చేసినప్పుడు వారి మాటలను నమ్మి వ్యక్తిగత వివరాలు, బ్యాంక్ సమాచారం, ఓటీపీ వంటి వివరాలు ఇవ్వకూడదని హెచ్చరించారు. గ్రామంలో అనుమానిత వ్యక్తులు కనబడిన, ఆకతాయిలు వేధించిన, ఇబ్బందులు కలిగించిన 100 డయల్ చేయాలన్నారు. పోలీసులు వచ్చి సమస్య తెలుసుకొని పరిష్కరిస్తారన్నారు. బేల ఎస్సై ఎల్. ప్రవీణ్ మాట్లాడుతూ..గ్రామంలో ఎవరైనా దేశీదారు అమ్మినా, గంజాయి విక్రయించిన, పండించిన, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన పోలీసులకు సమాచారం అందించాలని వివరాలు గోప్యంగా ఉంచుతామని పేర్కొన్నారు. శాంతి భద్రతల విషయంలో ఇబ్బందులు తలెత్తితే పోలీస్ స్టేషన్ కు వచ్చి నిర్భయంగా ఫిర్యాదు చేయవచ్చన్నారు. సిబ్బంది, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
