చిత్రం న్యూస్,ముథోల్: రైతులను ఇబ్బంది పెట్టే రైస్ మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ హెచ్చరించారు. ఆదివారం ముథోల్ మండలం బ్రహ్మణ్‌గావ్ గ్రామంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ..వరి ధాన్యం అమ్మకాల్లో కోత పేరుతో రైతులను ఇబ్బంది పెట్టే మిల్లర్లను ఏ మాత్రం ఉపేక్షించమని తెలిపారు. ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా రైతులను నష్టపరిచే విధంగా వ్యవహరిస్తే సంబంధిత రైస్ మిల్లులను సీజ్ చేయించేందుకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. రైతులు ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటే వెంటనే కలెక్టర్, సబ్ కలెక్టర్ లేదా తహసీల్దార్‌కి ఫిర్యాదు చేయాలని సూచించారు. లేదంటే విషయం తన దృష్టికి వచ్చిన వెంటనే తగిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. రైతుల ప్రయోజనాల రక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, కొనుగోలు కేంద్రాల ద్వారా రైతులకు మద్దతు ధర కల్పించడమే ముఖ్య ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో అధికారులు, రైతు సంఘాల ప్రతినిధులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
