చిత్రం న్యూస్, హైదరాబాద్: రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని, పండించిన పంటలకు సరైన మద్దతు ధర కల్పించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును ఎమ్మెల్యే పాయల్ శంకర్ కోరారు. హైదరాబాద్‌లో మంగళవారం మంత్రిని కలిసి రైతుల సమస్యలపై వినతిపత్రం అందజేశారు. ప్రస్తుతం సోయా బీన్ పంటను రైతులు మార్కెట్లో తక్కువ ధరలకు అమ్ముకోవాల్సి వస్తోందని, దీంతో క్వింటాల్‌కు రూ.1200–రూ.1500 వరకు నష్టపోతున్నారని ఎమ్మెల్యే తెలిపారు. ప్రభుత్వం కనీస మద్దతు ధరతో సోయాబీన్ పంటను కొనుగోలు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులకు వెంటనే పంట నష్టపరిహారం మంజూరు చేయాలని కోరారు. భారీ వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు బెంగాల్ గ్రామ్ విత్తనాలను సబ్సిడీపై అందించాలని సూచించారు. పత్తిని అమ్ముకునేందుకు మార్కెట్ యార్డ్‌కు వచ్చే రైతులు గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోందని, వారికి ఆహారం పంపిణీ చేయాలని కోరారు. రైతులకు మెరుగైన వసతులు కల్పించేందుకు మార్కెట్ యార్డులో కిచెన్ షెడ్, కాంపౌండ్ వాల్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. రైతుల ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఈ సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని పాయల్ శంకర్ మంత్రికి సూచించారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించినట్లుగా ఎమ్మెల్యే తెలిపారు.
