చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయ సిబ్బంది తమకు దొరికిన పర్సును అందజేసి నిజాయతీ చాటుకున్నారు. మంగళవారం ఆలయంలో అమ్మవారి దర్శనం చేసుకున్న కామారెడ్డి జిల్లాకు చెందిన ఓ భక్తురాలు తన పర్సును లడ్డు ప్రసాదం కౌంటర్ వద్ద మరిచిపోయారు. అక్కడే విధులు నిర్వహిస్తున్న ఆలయ హోంగార్డులు రాజేష్, రవి, వాగ్దేవి సొసైటీ సిబ్బంది నాగేష్ విషయం తెలుసుకుని ఆచూకీ కోసం పరిసరాల్లో గాలించారు. వారికి రూ.7 వేల నగదుతో కూడిన పర్సు దొరకడంతో అందులో ఆధార్ కార్డు ఆధారంగా గుర్తించి తిరిగి భక్తురాలికి అప్పజెప్పారు. విధుల పట్ల నిజాయతీ చాటుకున్న సిబ్బందిని భక్తులు అభినందించారు.

