తండ్రిని గొడ్డలితో నరికి చంపిన కొడుకు
తండ్రిని చంపి పొలంలో పాతిపెట్టిన కొడుకు.
చిత్రం న్యూస్, బాసర: కన్న తండ్రిని తనయుడు చంపిన ఘటన నిర్మల్ జిల్లా తానూరు మండలంలో చోటుచేసుకుంది. ఈ మేరకు బుధవారం బైంసా పట్టణంలోని ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ జానకి షర్మిల వివరాలు వెల్లడించారు. నిర్మల్ జిల్లా తానూరు మండలం ఎల్వి గ్రామంలో ఆగస్టు 31న వన్నేవాడ్ లక్ష్మణ్ మిస్ అయ్యాడనీ కుటుంబీకులు తానూరు పీఎస్ లో ఫిర్యాదు చేశారన్నారు. ఈ ఫిర్యాదును అడిషనల్ ఎస్పీ అవినాష్ కుమార్, సీఐ మల్లేష్, ఎస్సైలు జుబేర్, పెర్సిస్, అశోక్ లు చాకచక్యంగా వ్యవహరించి తనయుడే (మైనర్) తండ్రిని హత్య చేశాడని నిర్ధారించారని పేర్కొన్నారు. వాళ్ల పెంపుడు కుక్కే తమ పొలంలో మృతదేహాన్ని పాతిపెట్టిన స్థలాన్ని గుర్తు పట్టిందన్నారు. కొడుకుని లక్ష్మణ్ సరిగ్గా చదువు రాదని, పని సరిగ్గా రాదని తిడుతూ ఉండేవాడని, ఈ నేపథ్యంలోనే వాళ్ల పొలంలో గొడ్డలితో కొట్టి హత్య చేసి, గడ్డపారతో గుంత తవ్వి గోన సంచులలో పెట్టి పూడ్చి వేశారని పేర్కొన్నారు. ఈ కేసును చేధించడంలో సహకరించిన పోలీసు సిబ్బందిని ఎస్పీ అభినందించారు.
