ఘనంగా గాజుల పండగ
వంటా వార్పు, ఆట, పాటల నడుమ దోస్తుల గాజులు
చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా వ్యాప్తంగా మహిళా దోస్తుల గాజుల పండగ ట్రెండ్ గా మారింది. దోస్తులు గాజులు వేసుకుంటే బాగుంటారన్న సాంప్రదాయంతో ఏకీభవించి మహిళలు గ్రాండ్ గా ఈ గాజుల పండుగ జరుపుకుంటున్న విషయం విధితమే. ఆదివారం బాసర మండలంలోని కీర్గుల్( కె) గ్రామానికి చెందిన మహిళలు గాజుల పండగను కనుల పండువగా నిర్వహించుకున్నారు. మహిళలందరు నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలం సిహెచ్ కొండూర్ సౌడలమ్మ అమ్మవారిని దర్శించుకొని అనంతరం దేవి సన్నిధిలో ఏకరూప దుస్తులను ధరించి, ముందుగా గోరింటాకును ఒకరినొకరు పెట్టుకొన్నారు. అందరు పసుపు, కుంకుమ, పూలు ధరించి సాంప్రదయ బద్దంగా ఒకరినొకరు వారి స్నేహాన్ని గుర్తుచేసుకుంటూ వదిన మరదలు, అక్క చెల్లెల్లు గాజులు వేసుకొన్నారు. అనంతరం వంటలు వండుకొని భోజనాలు చేశారు. తదనంతరం కాలక్షేపానికి చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకొని డీజే పాటలతో బతుకమ్మ పాటలతో, ఆటలను ఆడారు. అంత్యక్షరీ, పాటలు పాడుతూ ఆనందోత్సహల నడుమ గాజుల పండగను రోజంతా అక్కడే గడిపారు.
