బాసరలో వరద బీభత్సం
*వచ్చే భక్తులకు తప్పని కష్టాలు
*గోదారమ్మ శాంతించమ్మ అంటూ ప్రజల వేడుకోలు
చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లాలోని పవిత్రమైన పుణ్యక్షేత్రం శ్రీ జ్ఞాన సరస్వతి బాసరలో గోదారమ్మ వరద బీభత్సం సృష్టిస్తోంది. శాంతించామ్మ అంటూ బాసర మండలంలోని గ్రామాల ప్రజలు వేడుకుంటున్నారు. బాసరలో ఒకపక్క శారదియా శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతుండడం మరోపక్క రైతులు, వ్యాపారుల కష్టాలు మొదలయ్యాయి. బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు 3వ రోజుకు చేరాయి. ఉత్సవాలను పురస్కరించుకొని గోదావరి నది స్నానానికి వచ్చే భక్తులు నది బ్యాక్ వాటర్ వల్ల రహదారి వెళ్లే మార్గాలు, పుష్కర ఘాట్లు నీట మునిగాయి. గంట గంటకు గోదావరి నది ప్రవాహం పెరగడంతో అధికారులు ముందు జాగ్రత్తగా ఎవరు అటువైపు వెళ్ళకుండా నది బ్యాక్ వాటర్ వల్ల రహదారులకు అడ్డుకట్టుగా బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు పోలీసు, రెవెన్యూ శాఖ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. గోదావరి నది లోతట్టు ప్రాంత రైతులు, ఆలయ పరిధిలో ఉన్న దుకాణ యజమానులు నీటి ప్రవాహంతో వ్యాపార కొనుగోలు లేక తీవ్రంగా నష్టపోయామని అంటున్నారు. మండల పరిధిలోని పలు గ్రామాల ప్రజలు తమ అవసరాల కోసం ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలకు వచ్చేందుకు గత 15 రోజుల నుండి ఐదు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇప్పటికైనా గోదారమ్మ తల్లి శాంతించమ్మ అని గ్రామాల ప్రజలు వేడుకుంటున్నారు.

