బాసరలో ఘనంగా ప్రారంభమైన దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
*తొలి రోజు శైలపుత్రి అవతారంలో అమ్మవారు
చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీ జ్ఞాన సరస్వతి దేవి అమ్మవారి సన్నిధిలో దేవీ శరన్నవరాత్రులు ఉత్సవాలు సోమవారం అత్యంత అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయంలో ఏర్పాటుచేసిన ప్రత్యేక మండపంలో అమ్మవారు మొదటిరోజు శైల పుత్రి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. సతీదేవి యోగాగ్నిలో తనువును త్యజించి పిదప పర్వతరాజైన హిమవంతుని యింట పుత్రికయై అవతరించడంతో ఆమెకు శైలపుత్రి అని, వృషభవాహనారూఢయైన ఈ మాతకు కుడిచేతిలో త్రిశూలము, ఎడమచేతిలో కమలంతో, తలపై చంద్రవంకను ధరించి విరాజిల్లుతుంది. ఈ అమ్మవారిని భక్తితో అర్చిస్తే మనోవాంఛలు నెరవేరుతాయని భక్తులు విశ్వసిస్తారు. ఆలయ వేద పండితులు, అర్చకులు, మంగళ వాయిద్యాలు, వేదమంత్రోచ్ఛారణలతో శైల పుత్రి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అమ్మవారికి నైవేద్యంగా కట్టె పొంగలి సమర్పించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అమ్మవారి దర్శనానికి వివిధ రాష్ట్రాల నుండి తరలివచ్చి భక్తులు మొక్కలు తీర్చుకుంటున్నారు.

