సమాజంలో విశ్వకర్మల పాత్ర వెలకట్ట లేనిది
*ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్
చిత్రం న్యూస్, ఆదిలాబాద్ : ప్రస్తుత సమాజంలో విశ్వకర్మల పాత్ర వెలకట్ట లేనిదని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. భగవాన్ విశ్వకర్మ జయంతి వేడుకలను గురువారం విశ్వకర్మ మరాఠీ సంఘం ఆధ్వర్యంలో గోపాలకృష్ణ మఠంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై విశ్వకర్మ విగ్రహానికి పూజలు నిర్వహించారు.. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ.. ప్రపంచ నిర్మాణంలో విశ్వకర్మ పాత్ర ఎనలేనిదని పేర్కొన్నారు. కులస్తులంతా ఐక్యంగా ఉంటేనే తమ హక్కులను సాధించుకోవచ్చని పేర్కొన్నారు.. జిల్లా కేంద్రంలో ఆలయ నిర్మాణానికి స్థలం కేటాయించేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.. గోపాలకృష్ణ పీఠాధిపతి యోగానంద సరస్వతి మాట్లాడుతూ.. ప్రతిరోజు విశ్వకర్మను పూజిస్తే మోక్షం లభిస్తుంది అన్నారు. మాజీ మంత్రి జోగు రామన్న, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంఛార్జి కంది శ్రీనివాస్ రెడ్డి, భాజపా నాయకురాలు సుహాసిని రెడ్డి, బీసీ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చిక్కాల దత్తు, కలాల శ్రీనివాస్, సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు జాన్వె సంతోష్, ఎం.దిలీప్, వివిధ మండలాల కులస్తులు, తదితరులు పాల్గొన్నారు.
భారీ శోభయాత్ర
విశ్వకర్మ విగ్రహంతో భారీ శోభాయాత్ర నిర్వహించారు. స్థానిక గోపాలకృష్ణ మఠం నుoచి ప్రారంభమైన శోభాయాత్ర వినాయక్ చౌక్, నేతాజీ చౌక్, అంబేద్కర్ చౌక్, శివాజీ చౌక్, ఠాకూర్ హోటల్ మీదుగా చందా వాగు వరకు కొనసాగింది..దారి పొడుగునా డీజే సౌండ్ మధ్య భక్తులు నృత్యాలు చేస్తూ ముందుకు కదిలారు.
