యూరియా కోసం రైతులకు తప్పని తిప్పలు
చిత్రం న్యూస్, బేల: రైతులకు యూరియా తిప్పలు తప్పడంలేదు. అదిలాబాద్ జిల్లా బేల మండల కేంద్రంలో సోమవారం యూరియా బస్తాలు దిగుమతి సమాచారం అందుకున్న రైతులు భారీగా తరలివచ్చారు . పలు గ్రామాల రైతులు వేకువజామునే యూరియా కోసం ఎరువుల దుకాణాల ముందు వరసలో నిలబడి కష్టాలు పడ్డారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నందున రైతులకు యూరియా అవసరం చాలా ఉంటుంది. ఇలాంటి సమయంలో యూరియాను ప్రభుత్వం అందుబాటులో ఉంచడం లేదంటూ రైతులు మండి పడుతున్నారు. వ్యవసాయ పనులు వదిలేసి మీ చుట్టూ తిరగాలా అంటూ మండిపడుతున్నారు. సహకార సంఘానికి యూరియా వస్తున్నా అది సరిపోవడంలేదని అధికారులు పేర్కొంటున్నారు. తెల్లవారిందంటే చాలు యూరియా కోసం సింగిల్ విండో గోదాములు, ఎరువుల దుకాణాల బాట పడుతున్నారు. రైతులు.ప్రతి రోజూ యూరియా వచ్చిందా.. అంటూ మండల కేంద్రానికి వచ్చిపోవాల్సిన దుస్థితి ఏర్పడిందని రైతులు వాపోయారు.

