పింఛన్ల పెంపు కోసం తహసీల్దార్ కార్యాలయం ముట్టడించిన బీడీ కార్మికులు
చిత్రం న్యూస్, కుంటాల : నిర్మల్ జిల్లా కుంటాల మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో బీడి కార్మికులు సోమవారం తహసీల్దార్ కార్యాలయం ముట్టడించారు. ఎన్నికల్లో హమీ ఇచ్చిన విధంగా తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ కుంటాల మండల ఇంఛార్జి కత్తి బాబు మాట్లాడుతూ..కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో రూ.4వేల పింఛను ఇస్తామని ప్రకటించిందన్నారు. ఇచ్చిన హామీని ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని పేర్కొన్నారు. 1000 బీడీలకు రూ.800 వేతనం ఇవ్వాలన్నారు. రెండు వందల బీడీల కట్టింగ్ యాజమాన్యం నిలిపివేయాలని, పీఎఫ్ తో సంబంధం లేకుండా పింఛను ఇవ్వాలని డిమాండ్ చేశారు. నాణ్యమైన ఆకు, తంబాకు ఇవ్వాలని తెలిపారు. కార్మికుల పిల్లలకు రావాల్సిన ఫెండింగ్ స్కాలర్ షిప్ విడుదల చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ గ్రామ కమిటీ అధ్యక్షుడు మానాజీ, ఉపాధ్యక్షులు శ్రీనివాస్, భోజన్న, పింఛను బీడీ కార్మికులు, తదితరులు పాల్గొన్నారు.
