Chitram news
Newspaper Banner
Date of Publish : 15 September 2025, 9:37 am Editor : Chitram news

వీధి కుక్కల భయంతో ఇంటి పైకప్పు ఎక్కిన ఎద్దు

వీధి కుక్కల భయంతో ఇంటి పైకప్పు ఎక్కిన ఎద్దు

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలో ఓ విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. వీధి కుక్కల భారీ నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు ఓ ఎద్దు ఏకంగా గ్రామానికి చెందిన కోగుర్వార్ శ్రావణ్ ఇంటి పైకప్పు పైకి ఎక్కింది. మనుషులు ప్రాణాలు కాపాడుకోవడానికి ఎంతటి సాహసానికి అయినా వెనకాడం. ఈ విషయంలో మనుషులే కాదు జంతువులు కూడా దీనికి అతీతం కాదు అని నిరూపించింది. ఆదిలాబాద్ జిల్లాలో జరిగిన ఈ సంఘటన స్థానికులను ఆశ్చర్యానికి గురిచేసింది. జైనథ్ మండలం నిరాల గ్రామానికి చెందిన రైతు షేక్ గఫూర్ తన ఎద్దును ఇంటి బయట కట్టేశాడు. అదే సమయంలో కొన్ని వీధి కుక్కలు గుంపుగా వచ్చి ఆ ఎద్దుపై దాడికి ప్రయత్నించాయి. దీంతో భయపడిన ఎద్దు, ప్రాణ భయంతో కట్టు తాళ్లను తెంచుకుని పరుగులు పెట్టింది. అలా పరుగెడుతూ పక్కనే ఉన్న రాళ్ల కుప్పపైకి ఎక్కి అక్కడి నుంచి నేరుగా ఓ ఇంటి పైకప్పు మీదకు చేరి తన ప్రాణాలు కాపాడుకుంది. ఇంటిపై ఎద్దును చూసిన గ్రామస్థులు ఒక్కసారిగా నివ్వెరపోయారు. తాళ్ళ సహాయంతో చాలా సేపు శ్రమించి ఎద్దును కిందకు దించారు. పై కప్పు మీదకు ఎక్కడంతో ఇంటికి స్వల్ప నష్టం వాటిల్లింది. ఈ ఘట నను చూసిన స్థానికులు తమ ఫోన్లలో వీడియోలు ఫోటోలు తీయగా… ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.