DEGREE COLLEGE: ప్రభుత్వ కళాశాలలో ఘనంగా ఫ్రెషర్స్ డే వేడుకలు5
చిత్రం న్యూస్, ఇచ్చోడ: ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శనివారం ఫ్రెషర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. మొదటగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కళాశాల ప్రిన్సిపాల్ డా.ఆచి శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఫైనల్, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు కలిసి ఈ వేడుకలను నిర్వహించడం అభినందనీయమని, ఇటువంటి కార్యక్రమాలు కొత్త విద్యార్థుల్లో ఆశను, ఉత్సాహాన్ని నింపుతాయని పేర్కొన్నారు. ఈ సంవత్సరం కళాశాలలో 170 మంది విద్యార్థులు కొత్తగా చేరడం సంతోషకరమని, ఈ విజయవంతమైన కార్యక్రమం నిర్వహణలో అధ్యాపకుల తోడ్పాటు, సమన్వయకర్త సరితా రాణి కృషి, వీడీసీ పాత్ర ఎంతో ఉందని ఆయన అభినందించారు. కళాశాల భవంతి నిర్మాణానికి విడీసీ సమిష్టిగా కృషి చేయాలని కోరారు. ట్రైబల్ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ఎస్.కిషన్ చౌహాన్ మాట్లాడుతూ.. విద్యార్థుల భవిష్యత్తును మార్చగల మహత్తర శక్తి చదువులోనే ఉందని, అందువల్ల పట్టుదలతో చదవాలని సూచించారు. వీడీసీ ప్రధాన కార్యదర్శి రేగుంట సురేష్ మాట్లాడుతూ.. కళాశాల అభివృద్ధికి అన్ని విధాల సహకరిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం అతిథులను శాలువాలతో సత్కరించారు. పాటలలో చక్కటి ప్రదర్శన కనబర్చిన ప్రశాంత్, ఉపన్యాసం ,చిత్రలేఖనంలో ప్రతిభ చూపిన కిషన్, సాయి, పావనిలకు బహుమతులు అందజేశారు. సాంస్కృతిక సమన్వయ కర్త టి.నర్సయ్య, సమన్వయం చేశారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను అలరించాయి. జాతీయ గీతం ఆలపించి కార్యక్రమాన్ని ముగించారు. కార్యక్రమంలో పిల్లి నరేష్, సామన్పల్లి సుదర్శన్, వీడీసీ సభ్యులు, వైస్ ప్రిన్సిపాల్, డా.సరస్వతి, డా.మధు,డా. అనిత, డా.మురళి, డా.తిరుపతి, దయాకర్, విజయకుమార్, ప్రభాత్ కుమార్ సుభాష్, బాలకృష్ణ, విజయలక్ష్మి తదితర అధ్యాపకులు పాల్గొన్నారు.

