చెంచులకు ఇందిరమ్మ ఇళ్ళు ఇవ్వాలి
సీపీఐ (ఎం.ఎల్) న్యూడెమోక్రసీ ఖానాపూర్ డివిజన్ కార్యదర్శి సునారికారి రాజేష్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే, ఐటీడీఏ పీవో కు వినతి
చిత్రం న్యూస్, కడెం: నిర్మల్ జిల్లా కడెం మండలంలోని లింగాపూర్ గ్రామంలో70 ఏళ్లుగా ఇళ్ళు లేని నిరుపేద ఆదిమ గిరిజనులకు, ఇందిరమ్మ ఇళ్ళు ప్రభుత్వం నిర్మించి ఇవ్వాలని సీపీఐ (ఎం.ఎల్) న్యూ డెమోక్రసీ పార్టీ ఖానాపూర్ డివిజన్ కార్యదర్శి సునారికారి రాజేష్ అన్నారు. ఆయన ఆధ్వర్యంలో ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్, ఐటీడిఏ పీఓ కుష్బూ గుప్తా కు వేరు వేరుగా వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీపీఐ (ఎం.ఎల్) న్యూడెమోక్రసీ ఖానాపూర్ డివిజన్ కార్యదర్శి సునారికారి రాజేష్ మాట్లాడుతూ..లింగాపూర్ గ్రామంలో ఆదిమా గిరిజనలు, చెంచులు గత 70 సంవత్సరాల నుండి జీవిస్తున్నారు. వీరికి ఉండేందుకు ఉండడానికి నిలువ నీడ లేదు. గ్రామాల్లో ఇప్పటికీ డేరాలు వేసుకొని ఉంటున్నారు. ఇంత వరకు ఏ ప్రభుత్వం ఇళ్ళు ఇవ్వలేదన్నారు. వీళ్లు గతంలో వేట మీద ఆధారపడి బ్రతుకు కొనసాగించే వాళ్లు. టైగర్ జోన్ వల్ల జీవన ఆధారం కోల్పోయారు. దీని వల్ల పేపర్ డబ్బాలు ఏరుకొని జీవనం సాగిస్తున్నారు.వీళ్లకు పని ముట్లు లేవు. అందరిలాగా కట్టుకొని బ్రతికే పరిస్థితి లేదు. వీళ్ళ బ్రతుకులు దిన దిన గండంగా ఉంది. వీళ్లు చెంచులని ఎవరు పట్టించుకున్న దాఖలు లేవన్నారు. ప్రభుత్వం చెంచులకు, నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
ఎమ్మెల్యే బొజ్జు పటేల్ స్పందించి ప్రభుత్వపరంగా ఇందిరమ్మ ఇండ్లు అన్ని రకాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఐటీడీఏ పీవో కుష్బూ గుప్తా చెంచుల సమస్యల పరిష్కారానికి ఇందిరమ్మ ఇళ్ళు నిర్మించి ఇస్తామని పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో పేరు ఉన్నదా లేదా చెక్ చేసి లేకుంటే చేర్చాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వినతి పత్రం అందజేసిన వారిలో ఐఎఫ్ టీయూ జిల్లా ఉపాధ్యక్షులు లింగన్న, అడ్వకేట్ నేదు రి జాకబ్, స్వచ్ఛంద సంస్థ కోఆర్డినేటర్ నేదురి లలిత కుమారి, చెంచులు శిరీష ,చంద్రకళ ,పూజిత ,చంద్రకళ ,చెంచులక్ష్మి తదితరులు ఉన్నారు.

