భైంసా మున్సిపల్ కార్యాలయం ఎదుట బైఠాయింపు, ధర్నా
*వేతనాల పెంపుదల కోసం విధుల బహిష్కరణ
చిత్రం న్యూస్, భైంసా: కార్మిక చట్టాన్ని అనుసరిస్తూ తమకు వేతనాల పెంపుదల చేపట్టాలని డిమాండ్ చేస్తూ భైంసా మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు శుక్రవారం ఆందోళనకు దిగారు. ఉదయం వేళలో మున్సిపల్ కార్యాలయానికి వచ్చిన పారిశుద్ధ్య కార్మికులు వేతనాల పెంపుదల చేపట్టేంతవరకు విధులకు హాజరుకాబోమని వెల్లడించి కార్యాలయ ఆవరణలో బైఠాయించారు. తామందరము విధులను బహిష్కరిస్తున్నట్లుగా వెల్లడించి ప్రవేశ మార్గం వద్ద ధర్నాకు దిగారు. మున్సిపల్ కమిషనర్ రాజేష్ కుమార్ పారిశుద్ధ్య కార్మికులకు నచ్చచెప్పేందుకు పలు విధాలుగా యత్నించినప్పటికీ వారందరూ ధర్నాను కొనసాగించారు. కొంతమేర గడువిస్తే ఉన్నతాధికారులకు వేతనాల పెంపు విషయం వివరించి సమస్య పరిష్కరిస్తానని మున్సిపల్ కమిషనర్ రాజేష్ కుమార్ తెలియజేసినప్పటికి పారిశుద్ధ్య కార్మికులు ససేమిరా అన్నారు. వేతనాల పెంపుదలతో పాటు తమ పీఎఫ్ ఖాతాలలో సైతం డబ్బులు జమ చేయాలని డిమాండ్ చేశారు. ఇతర మున్సిపాలిటీల్లోని పారిశుద్ధ్య కార్మికులకు ఇచ్చే వేతనాలను తమకు కూడా అందించాలని, పీఎఫ్ ఖాతాలలో పెండింగ్ లో ఉన్న డబ్బులన్నింటినీ చెల్లించాలని డిమాండ్ చేశారు.

