ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో డబ్బులు అడిగితే నేరుగా నాకు ఫోన్ చేయండి:మంత్రి జూపల్లి
*ఇంద్రవెల్లి అమరవీరుల స్మృతివనాన్ని ప్రారంభించిన మంత్రి జూపల్లి
*మంత్రితో పాటు పర్యటనలో పాల్గొన్న కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి
చిత్రం న్యూస్, ఆదిలాబాద్ బ్యూరో: కాంగ్రెస్ ప్రజాపాలనలో అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నామని పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గురువారం ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించిన మంత్రి పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. బోథ్ లో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి పాల్గొని పలు సంక్షేమ పథకాలకు సంబంధించిన చెక్కులను, ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్ కాపీలను అందజేశారు. అనంతరం ఇంద్రవెల్లి అమరవీరుల స్థూపం వద్ద స్మృతివనాన్ని ప్రారంభించారు. అమరవీరుల కుటుంబ సభ్యులకు ట్రై కార్ యూనిట్లను పంపిణీ చేశారు. తదనంతరం ఇంద్రవెల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్ కాపీలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ..ఇందిరమ్మ ఇళ్ల మంజూరు లబ్దిదారులను అధికారులు కానీ ,ప్రజాప్రతినిధులు ఎవరైనా డబ్బులు అడిగితే కఠిన చర్యలు తీసుకుంటామని, అలా ఎవరైనా డబ్బులు అడిగితే నేరుగా నాకు ఫోన్ చేయాలని తన నంబర్ ప్రజలకు ఇచ్చారు. అంతకుముందు ఇంద్రవెల్లి స్థూపం వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు.భూమి కోసం విముక్తి కోసం దోపడికి వ్యతిరేకంగా తిరగబడి అసువులు బాసిన అమరవీరుల స్మారకార్ధం ఇంద్రవెల్లిలో స్మృతివనాన్ని ఏర్పాటు చేయాలన్నది ఇక్కడి గిరిజనుల చిరకాల స్వప్నమని, ఎట్టకేలకు ఆ కల నెరవేరిందని అన్నారు. సీఎంగా రేవంత్ రెడ్డి అధికార పగ్గాలు చేపట్టిన వెంటనే ఇంద్రవెల్లి అమరవీరుల స్థూపాన్ని స్మృతివనంగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీ చేశారని, . అవసరమైన నిధులను కూడా వెంటనే మంజూరు చేశారని గుర్తు చేశారు. కోటి రూపాయలతో స్మృతివనాన్ని అభివృద్ధి చేశామని తెలిపారు. ఈ స్మృతి వనం వద్ద ఏటా ఆదివాసి అమరులకు స్వేచ్ఛా వాతావరణంలో నివాళులు అర్పించుకునేందుకు ప్రభుత్వం అవకాశం ఇచ్చిందని చెప్పారు. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగు పర్చడానికి ప్రభుత్వ, సంక్షేమ పథకాలు మాత్రమే సరిపోవని, సామాజిక రుగ్మతలను రూపుమాపినప్పుడే నవ సమాజం నిర్మితమవుతుందని ఉద్భోదించారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దండే విట్టల్,ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్, డిసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, జిల్లా గ్రంధాలయ చైర్మన్ మల్లెపూల నర్సయ్య, టీపీసీసీ ఉ పాధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క,మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, మాజీ కేంద్రమంత్రి వేణుగోపాలాచారి, కాంగ్రెస్ పార్టీ బోథ్ అసెంబ్లీ ఇన్చార్జ్ ఆడే గజేందర్, అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, ఎస్పీ అఖిల్ మహాజన్ తదితరులు పాల్గొన్నారు.

