చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేస్తున్న ఎమ్మెల్యే పాయల్ శంకర్
చిత్రం న్యూస్, అదిలాబాద్
ఎన్ని ప్రభుత్వాలు మారిన, ఎన్ని పోరాటాలు చేసినా బీసీ కులాల ప్రజల బతుకులు మాత్రం మారడం లేదని ఎమ్మెల్యే పాయల్ శంకర్ పేర్కొన్నారు. చాకలి ఐలమ్మ చూపిన తెగువను స్ఫూర్తిగా తీసుకొని మరిన్ని పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా స్థానిక రిమ్స్ ఆసుపత్రి వద్ద బుధవారం అధికారికంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ శ్యామలా దేవి, రజక సంఘం జిల్లా అధ్యక్షుడు చిక్కాల దత్తుతో కలిసి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఆనాడు చాకలి ఐలమ్మ చూపిన తెగువ, పోరాట పటిమ తెలంగాణ యావత్ ప్రజానీకానికి, తెలంగాణ సాయిధ పోరాటానికి ఊపిరినిచ్చిందని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం వస్తే తమ తలరాతలు మారుతాయని రాష్ట్ర సాధన పోరాటంలో ముందు వరుసలో ఉన్న బీసీలు, ఎన్నో ప్రాణ త్యాగాలు చేశారని, కానీ రాష్ట్రం వచ్చిన బీసీ చేతి వృత్తి కులాలు కష్టాల్లోనే ఉన్నాయని అన్నారు. వర్ధంతి, జయంతి కార్యక్రమాలు అధికారికంగా నిర్వహించడంతో పాటు తెలంగాణలోని 33 జిల్లాల్లో చాకలి ఐలమ్మ విగ్రహాలను ప్రభుత్వమే ఏర్పాటు చేయాలని కోరారు. కార్యక్రమంలో పలువురు బీసీ సంఘం నాయకులు, రజక సంఘం నాయకులు, బీజేపీ నేతలు తదితరులు పాల్గొన్నారు.

