నాలుగు డీజేలు సీజ్ – ఇచ్చోడ సీఐ బండారి రాజు
*నేరడిగొండ మండలం వడూర్ గ్రామంలోని ఘటన.
*డీజే యజమానులు, ఆపరేటర్లపై కేసులు నమోదు
*సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారమే సౌండ్ సిస్టం ఏర్పాటు చేయాలి
చిత్రం న్యూస్, నేరడిగొండ: సుప్రీంకోర్టు నియమ నిబంధనకు లోబడి సౌండ్ బాక్సులను ఏర్పాటు చేయాలని, నిబంధనలు అతిక్రమించిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తప్పవని ఇచ్చోడ సీఐ బండారి రాజు తెలిపారు. శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం వడూరు గ్రామంలో గణపతి మండపాల వద్ద నిబంధనలను అతిక్రమించి ఏర్పాటు చేసిన నాలుగు డీజేలను స్వాధీనం చేసుకొని డీజే యజమానులపై, ఆపరేటర్ల పై నేరడిగొండ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ప్రజలకు ఇబ్బందులు కలిగేలా అధిక శబ్దం వచ్చే విధంగా డీజేలను ఏర్పాటు చేస్తే చర్యలు తప్పవని సూచించారు. గణపతి మండపాల వద్ద ఎలాంటి డీజేలకు అనుమతి లేదని, అతిక్రమించిన వారి పై చట్టప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నేరడిగొండ ఎస్సై ఇమ్రాన్ ఖాన్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.



