భైంసాలో కొనసాగుతున్న వినాయక నిమజ్జనోత్సవ వేడుకలు
*వినాయకుడికి ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే, కలెక్టర్
*బందోబస్తును పర్యవేక్షిస్తున్న జిల్లా ఎస్పీ జానకి షర్మిల
చిత్రం న్యూస్,భైంసా: నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో వినాయక నిమజ్జనోత్సవ శోభాయాత్ర కొనసాగుతుంది. తొమ్మిది రోజులపాటు వివిధ గణేష్ మండలీల ఆధ్వర్యంలో ప్రతిష్టించిన విగ్నేశ్వరుడికి ఉదయం, సాయంత్రం సమయాల్లో వేద పండితుల మంత్రోచ్ఛారణ మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రత్యేకంగా అలంకరించిన వాహనాల్లో విఘ్నేశ్వరుడిని ప్రతిష్టించారు. అడుగడుగునా మంగళ హారతులతో మహిళలు స్వాగతం పలుకుతూ పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే పీ.రామారావు పటేల్, జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, ఉత్సవ సమితి సభ్యులు వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
శోభాయాత్ర సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేకంగా బందోబస్తును ఏర్పాటు చేశారు. గణేష్ నిమజ్జోత్సవ శోభాయాత్ర వెళ్లే మార్గంలో నాలుగు డ్రోన్లు, 120 సీసీ కెమెరాలతో ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేశారు. అదేవిధంగా 600 మంది పోలీసులతో బందోబస్తు చేపట్టారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా జిల్లా ఎస్పీ జానకి షర్మిల ప్రత్యేకంగా చర్యలు తీసుకున్నారు. శోభాయాత్రను పురస్కరించుకొని వివిధ సంఘాల ఆధ్వర్యంలో భక్తుల సౌకర్యార్థం అల్పాహారం పంపిణీ కార్యక్రమాలను చేపట్టారు. గడ్డేన్న వాగు ప్రాజెక్టు వద్ద వినాయక నిమజ్జనోత్సవం పురస్కరించుకొని గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచారు. నిమజ్జనోత్సవం సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో ఏర్పాటుచేసింది. యువకులు, చిన్నారులు శోభాయాత్రలో చేస్తున్న నృత్యాలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. గణపతి ఉత్సవాలు, వినాయక నిమజ్జనం పూర్తవడంతో అనేక ప్రాంతాలలో భక్తులు గణనాథుడికి ఘనంగా వీడ్కోలు పలికారు. జై గణేష్ మహారాజ్ అంటూ నినాదాలతో, డీజే పాటలతో, వాహనాలలో విగ్రహాలను ఊరేగిస్తూ, భక్తిశ్రద్ధలతో గణపయ్య ..మళ్ళీ రావయ్యా అని కోరుకుంటూ నిమజ్జనం చేశారు.