జన్మదిన వేళ ..పాఠశాల విద్యార్థుల దత్తత
*మేడిగూడ (ఆర్) ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఉచితంగా షూల పంపిణీ
*ప్రముఖ వైద్యులు కళ్ళెం వెంకట్ రెడ్డి ఉదారత
చిత్రం న్యూస్, సాత్నాల: ఆదిలాబాద్ పట్టణానికి చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ కళ్ళెం వెంకట్ రెడ్డి బుధవారం తన జన్మదినం సందర్భంగా సాత్నాల మండలం మేడిగూడ (ఆర్) ప్రాథమికోన్నత పాఠశాలలోని వంద మంది విద్యార్థులకు సతీమణి డాక్టర్ జీవితతో కలిసి ఉచితంగా షూలను పంపిణీ చేసి ఉదారత చాటారు. పాఠశాల విద్యార్థులకు ఉచితంగా వైద్యం అందించేందుకు తాను దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు. అనంతరం పాఠశాలలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో డాక్టర్ కళ్ళెం వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థులు ఆరోగ్య లక్షణాలను అలవర్చుకుంటూ చక్కగా చదువుకొని ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షించారు. చిన్నప్పటి నుంచి చదువుతో పాటు ఆరోగ్యంగా ఉంటేనే అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారన్నారు. వైద్యపరంగా విద్యార్థులకు ఉచితంగా వైద్యం అందిస్తానని చెప్పారు. లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకెళ్ళాలని, తల్లిదండ్రులకు మంచిపేరు తీసుకు రావాలన్నారు. అనంతరం డాక్టర్ జీవిత వెంకట్ రెడ్డి దంపతులని శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ప్రకాష్ యాదవ్, వీడేసీ చైర్మన్ క్యాతం రాంరెడ్డి, గ్రామస్తులు మడపాచి శ్యాం, పోలవేణి అడెల్లు, డోకె సంతోష్, క్యాతం శివప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.




