ఆదిలాబాద్ జిల్లాలో ముంపు ప్రాంతాలు, పంటలను పరిశీలించిన మాజీ కేంద్రమంత్రి వేణుగోపాల చారి
చిత్రం న్యూస్, ఆదిలాబాద్: రాష్ట్రంలో రైతుల సంక్షేమం కోసం పనిచేసే ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం అని కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాల చారి అన్నారు. గత పక్షం రోజులకు పైగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షానికి, వచ్చిన వరదలతో కొన్ని వేల ఎకరాల్లో పంటలు పూర్తిగా దెబ్బతిని రైతులు ఎంతో నష్టపోయారని, ఎవరూ ఆందోళన చెందవద్దన్నారు. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు బోథ్ నియోజకవర్గంలో నష్టపోయిన పంటలను నియోజక వర్గ ఇన్చార్జి ఆడే గజేందర్, తలమడుగు మాజీ జడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి పలువురు కాంగ్రెస్ నేతలు, నాయకులతో సందర్శించారు. ముందుగా జిల్లాకు వచ్చిన ఆయనకు నాయకులు సాదర స్వాగతం పలికారు. అనంతరం తలమడుగు మండలంలోని పలు గ్రామాలలో పాటు, తలమడుగు మండలంలోని కజ్జర్ల గ్రామంలో నష్టపోయిన పంటలను పరిశీలించారు. పంట నష్టం అంచనా వేసి అధికారులు రైతులకు పూర్తి న్యాయం జరిగేలా చూడాలని అధికారులకు సూచించారు.ఆ నివేదికలు వెంటనే ప్రభుత్వానికి అందజేయాలని కోరారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వరదల వల్ల నష్టపోయిన రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని కోరారు. రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజాపాలన కొనసాగుతుందని నష్టపోయిన ప్రతి రైతుకు న్యాయం జరుగుతుందని భరోసా కల్పించారు. ప్రతిపక్షాల మాటలు నమ్మి ఆందోళనకు గురికావద్దని ప్రభుత్వం పై నమ్మకం ఉంచాలని అన్నారు. ఇందులో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు లోక ప్రవీణ్ రెడ్డి, తదితరులు ఉన్నారు.



