తర్నం బ్రిడ్జిని నిర్మించండి _ఏఎంసీ మాజీ వైస్ ఛైర్మన్ వేణుగోపాల్ యాదవ్
చిత్రం న్యూస్, భోరజ్ :ఆదిలాబాద్ జిల్లా భోరజ్ మండలంలోని తర్నం బ్రిడ్జిని నిర్మించకపోవడంతో 353బీ జాతీయ రహదారిపై వెల్లె ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని బీఆర్ఎస్ మండల నాయకులు మంగళవారం నిరసన తెలిపారు. అనంతరం వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ వైస్ ఛైర్మన్ వేణుగోపాల్ యాదవ్ మాట్లాడుతూ.. కొద్దిపాటి వర్షానికి నూతనంగా నిర్మించిన వంతెనపై వరద నీరు ప్రవహిస్తోందన్నారు. దీంతో తెలంగాణ_ మహారాష్ట్ర ప్రజలకు రాకపోకలు నిలిచి ఇబ్బందులకు గురవుతున్నారని, భారీ వాహనాలు గంటల తరబడి వేచి ఉంటున్నాయని అన్నారు. బైకులు సైతం వెళ్ళలేని పరిస్థితి ఏర్పడిందని, వెంటనే బ్రిడ్జిని నిర్మించాలని డిమాండ్ చేశారు. బ్రిడ్జి మీదుగా వెళ్లాల్సిన ప్రజలు ఆదిలాబాద్ రూరల్ మండలం లాండసాంగ్వి మీదుగా తిరిగి వెళ్లాల్సి వస్తుందని, గతంలో ఉన్న పాత బ్రిడ్జిని కూల్చేసి మరింత ఇబ్బందులకు గురి చేశారని మండిపడ్డారు, బ్రిడ్జి పేరును వాడుకొని అధికారంలోకి వచ్చిన నాయకులు ఇప్పటికైనా కొత్త బ్రిడ్జిని నిర్మించాలని భోరజ్ మండల నాయకులు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ పురుషోత్తం, సర్పంచుల సంఘం మాజీ అధ్యక్షుడు ఊ షన్న, జైనథ్ ఏఎంసీ మాజీ చైర్మన్ ప్రభాకర్, మాజీ డైరెక్టర్ సతీష్, మాజీ ఎంపీటీసీలు మహేందర్, కోల భోజన్న, బీఆర్ఎస్ నాయకులు అశోక్ రెడ్డి, రవి, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.