బోరిగాంలో ప్రమాదవశాత్తు నిప్పు అంటుకొని ఇల్లు దగ్ధం
చిత్రం న్యూస్, భైంసా: నిర్మల్ జిల్లా ముథోల్ మండలంలోని బోరిగాం గ్రామానికి చెందిన లక్ష్మి అనే మహిళ ఇంట్లో సోమవారం ఉదయం ప్రమాదవశాత్తుగా నిప్పు అంటుకొని ఇల్లు దగ్ధమైంది. స్థానికులు కథనం ప్రకారం.. లక్ష్మి తన ఇంట్లో పూజ చేసేందుకు దీపం వెలిగించింది . పని నిమిత్తం వేరే గ్రామానికి తరలివెళ్ళింది. అయితే ప్రమాదవశాత్తు ఆ దీపం ఇంటికి తగిలి మంటలు అంటుకున్నాయి. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు బాధితురాలికి ఫోన్ చేసి సమాచారం చేరవేశారు. మంటలు చుట్టుపక్కల వ్యాపించకుండా స్థానికులు నీరు పోసి మంటలను ఆర్పి వేశారు. ఇంట్లో ఉన్న దుస్తులు, ఆహార ధాన్యాలు, రూ. 20 వేల నగదు కాలి బూడిద అయ్యాయని బాధితురాలు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న ఆర్ఐ నారాయణ పటేల్ సంఘటన స్థలానికి చేరుకొని ప్రమాదానికి గల వివరాలను అడిగి తెలుసుకున్నారు. స్థానికుల సమక్షంలో పంచనామ నిర్వహించారు. సుమారు రూ.65 వేల వరకు ఆస్తి నష్టం వాటిల్లిందని బాధిత మహిళ తెలిపారు. ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని కోరారు.