Chitram news
Newspaper Banner
Date of Publish : 29 August 2025, 4:22 pm Editor : Chitram news

ఉగ్రరూపం దాల్చిన బాసర “గోదావరి”

బాసరను సందర్శించిన జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల  

శాంతించమ్మ అంటూ గోదారమ్మకు ఆలయ అధికారులు, పూజారుల ప్రత్యేక పూజలు  

చిత్రం న్యూస్, బాసర:  నిర్మల్ జిల్లాలోని బాసర పవిత్రమైన పుణ్యక్షేత్రం శ్రీ జ్ఞాన సరస్వతి. రెండు రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాలు,  ఎగువన ఎడతెరిపిలేని వర్షాలకు బాసర గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తుంది. ఇప్పటికే మొదటి ఘాట్ వద్ద ఉన్న పిండ ప్రధాన షెడ్డు వరదలతో మునిగిపోయింది. బాసర చరిత్రలో మొదటి సారి 1983లో వచ్చిన భారీ నుంచి అతి భారీ వర్షాల, వరదల కారణంగా గోదావరి ఘాట్లు మునిగినట్లు చరిత్రకారులు చెబుతుండగా అదే పరిస్థితి మళ్ళీ కనిపిస్తుందని అంటున్నారు.. గోదావరి ఇప్పటికే బ్యాక్ వాటర్ కారణంగా బాసరలో పలు కాలనీలు మునిగిపోయాయి. గత అర్ధ రాత్రి లోతట్టు ప్రాంతమైన హరిహర కాటేజ్‌లో వరదలో చిక్కుకున్న పది మందిని సంబంధిత అధికారులు, గ్రామస్తులు బయటకు తీసుకువచ్చారు. ప్రస్తుతం గోదావరి వరద ప్రవాహం ప్రధాన ఘాట్ మునగడానికి ఒక మెట్టు మాత్రమే మిగిలి ఉంది. బాసర చుట్టుప్రక్కల ప్రజలు గోదావరి వరదను చూడటానికి తరలివస్తున్నారు

శాంతించమ్మ గోదారమ్మ అంటూ ప్రత్యేక పూజలు

బాసరలో గోదావరి నది ఉగ్రరూపం దాల్చిన నేపథ్యంలో ఆలయ అర్చకులు వైదిక బృందం ఆధ్వర్యంలో శుక్రవారం శాంతించమ్మా..! గోదారమ్మ అంటూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయం వద్ద నుంచి గోదావరి నది వరకు మేళతాళాల మధ్య చేరుకొని గోదావరి నదీమ తల్లికి పట్టుచీర, వాయినం, నైవేద్యాన్ని సమర్పించారు. గోదావరి నది శాంతించి దేశం, రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం సంభవించవద్దని వేడుకున్నారు. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో గోదావరి నది ప్రమాదస్థాయిని దాటి ప్రవహిస్తోంది. గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇప్పటికే కామారెడ్డి, నిజామాబాద్ మెదక్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. గత రెండు రోజుల వరదలలో చిక్కుకొని పది మంది మృతి చెందిన విషయం విదితమే..

బాసరలో ముంపు ప్రాంతాల్లో ట్రాక్టర్ పై ఎస్పీ పర్యటన

బాసరలో గోదావరి నది ఉధృతి పెరగడంతో తీర ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. గోదావరి నీరు ఎగసిపడడంతో పలు లాడ్జ్ లు, వ్యాపార సంస్థలు జలమయం కాగా, స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల స్వయంగా ట్రాక్టర్‌పై ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. ముంపు పరిస్థితులను సమీక్షించి, బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించే చర్యలను చేపట్టారు. ప్రజలు ఆందోళన చెందవద్దని, అధికార యంత్రాంగం అన్ని రకాల సహాయక చర్యలకు సిద్ధంగా ఉందని ఎస్పీ భరోసా ఇచ్చారు. రక్షణ చర్యల్లో పోలీసులు, రెవెన్యూ సిబ్బంది, ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు భాగస్వామ్యమై సహాయ కార్యక్రమాలు కొనసాగిస్తున్నాయని వెల్లడించారు. గోదావరి ఉధృతి ఇంకా కొనసాగుతుండటంతో తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల సూచించారు.

ఎకరాకు రూ.30 వేలు అందించాలి  బాసరలో కురిసిన భారీ వర్షానికి గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో కురిసిన భారీ వర్షానికి పంట పొలాలు నీట మునిగాయి. నివాస గ్రామాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. జిల్లా ఎస్పీ జానకి షర్మిల పర్యటించి గ్రామ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సంబంధిత అధికారులకు సూచించారు. జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి  షర్మిల, ఏఎస్పీ అవినీష్ కుమార్, సీఐ మల్లేష్. బాసర ఎస్సై బి. శ్రీనివాస్ సిబ్బందిని ఆదేశించారు. అనంతరం జిల్లా ఎస్పీని రాష్ట్ర బీజేపీ కౌన్సిలింగ్ మెంబర్ పోతుగంటి సతీశ్వర్ రావు కలిసి మండల కేంద్రంలో పంటలు వేసిన రైతులు తీవ్రంగా నష్టపోయారని, వారికి నష్టపరిహారం అందించేందుకు జిల్లా కలెక్టర్  ఇక్కడ సందర్శించాలని ఎస్పీ దృష్టికి తీసుకువచ్చారు. అదేవిధంగా నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.30 వేల నష్టపరిహారం అందించాలని ఎస్పీ దృష్టికి తీసుకువచ్చారు.

సురక్షిత ప్రాంతాలకు తరలింపు  బాసరలో హరిహర కాటేజీ లో చిక్కుకున్న నలుగురు వరద బాధితులను బాసర గంగపుత్ర సంఘం సభ్యులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు.