కల్లూర్–కుంటాల గ్రామాల నడుమ స్తంభించిన రాకపోకలు
*పలుచోట్ల వరదకు కోతకు గురైన రోడ్లు
చిత్రం న్యూస్, భైంసా:ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. నిర్మల్ జిల్లాలోని కుంటాల మండల పరిధిలోని కల్లూర్–కుంటాల రహదారి మార్గం ప్రమాదకరంగా మారింది. బుధవారం రాత్రి నుంచి కురిసిన భారీ వర్షాలతో రహదారి మార్గంలోని అందకూర్ అలుగు ఉధృతంగా ప్రవహించడం మూలంగా అక్కడి ప్రాంతంలోని రోడ్డు భారీ పరిమాణంతో కోతకు గురైంది. రోడ్డుకు ఒక వైపు అధిక భాగం కోతకు గురికావడం మూలంగా రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది, అదిలాబాద్ నుంచి హైదరాబాద్ మార్గంలో వెళ్లే వాహనదారులకు నిర్మల్ పోలీసులు పలు సూచనలు చేశారు. ఆదిలాబాద్ నుంచి కామా రెడ్డి మీదుగా హైదరాబాద్ వెళ్లే వాహనదారులు నిర్మల్ సమీపంలోని కొండాపూర్ బ్రిడ్జి నుంచి ఎడమ వైపునకు తిరిగి యూటర్న్ తీసుకుని వెళ్లాలని సూచించారు. కొండాపూర్ నుంచి మామడ ఖానాపూర్ మెట్ పల్లి, జగిత్యాల, కరీంనగర్, మీదుగా హైదరాబాద్ వెళ్ళవలసి ఉంటుందని నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల తెలిపారు.వర్షం పరిస్థితి ఇలాగే కొనసాగితే కల్లూర్–కుంటాల రోడ్డు మార్గంలో పూర్తి స్థాయిలో రవాణాకు ఆటంకం కలిగే పరిస్థితులున్నాయి. అంతే కాకుండా ఆ మార్గంలో రాకపోకలు పూర్తిగా నిలిచే పరిస్థితులు నెలకొని ఉన్నాయి. భారీ వర్షం కురవడంతో వెంకూర్ లోవెల్ వంతెన సైతం ఉధృతంగా ప్రవహిస్తుంది. పంటలు నీట మునిగిపోయాయి. సోయా పత్తి, వరి పంటలు నీట మునిగాయి. భారీ వర్షానికి పంటలు దెబ్బతినడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.