Bhoraj to bela road danger – భోరజ్ నుంచి బేల రోడ్డు డేంజర్
అధ్వానంగా 353 బీ జాతీయ రహదారి విస్తరణ పనులు
చిత్రం న్యూస్, జైనథ్: ఆదిలాబాద్ జిల్లా భోరజ్ నుంచి బేల వరకు నూతనంగా చేపడుతున్న 353 బీ జాతీయ రహదారి విస్తరణ పనులు అధ్వాన్నంగా మారాయి. భోరజ్ నుంచి మహారాష్ట్రకు వెళ్ళే ఈ రహదారి నిత్యం వాహనాల రాకపోకలతో బిజీగా ఉంటుంది. రోడ్డు విస్తరణలో భాగంగా భోరజ్ నుంచి మహారాష్ట్ర సరిహద్దు వరకు నూతనంగా రోడ్డు నిర్మాణం చేపట్టారు. కొంత వరకు రోడ్డు నిర్మాణం పూర్తయింది. అయితే నిర్మాణం పూర్తయిన కొన్ని రోజులకే భోరజ్ నుండి బేల మధ్యలో ఉన్న రోడ్డుపై చాలా చోట్ల గుంతలు ఏర్పడ్డాయి. దీనితో నిర్మించిన కొద్ది రోజులకే రోడ్డుపై కంకర తేలి గుంతలు ఏర్పడడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కాంట్రాక్టర్ రోడ్డును నాసిరకంగా నిర్మాణం చేపట్టడంతో భారీ గుంతలు ఏర్పడి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని వాహనదారులు వాపోతున్నారు. సంబంధిత అధికారులు తమకేం పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇప్పుడే రోడ్డు పరిస్థితి ఇలా ఉంటే భవిష్యత్తులో ఇంకా ఎలా ఉంటుందోనని వాహనదారులు భయాందోళనకు గురవుతున్నారు. రోడ్డు మరమ్మతులు చేయించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.