*భజన కళాకారులను సన్మానిస్తున్న రామాలయ కమిటీ ఛైర్మన్ జీ వీ రమణ
చిత్రం న్యూస్, సొనాల: ఆదిలాబాద్ జిల్లాలోని సొనాల మండల కేంద్రంలో శ్రీ రామాలయంలో శ్రావణమాసాన్ని పురస్కరించుకొని, ప్రతి సంవత్సరం సీతారామ భజన మండలి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రావణ మాస నిత్య భజన కార్యక్రమం ఆదివారంతో ముగిసింది. ఆలయంలో నిత్య భజనలు చేయడం గత 12 సంవత్సరముల నుండి ఆనవాయితీగా వస్తుంది. ఈ సంవత్సరం కూడా శ్రావణమాసం మొదలైన నాటి నుండి ప్రతిరోజు సీతారామ భజన మండలి కళాకారులు భక్తి గీతాలు ,ఆధ్యాత్మిక గీతాలు, హరినామ సంకీర్తనలు, శ్రీరామ కీర్తనలు ఆలపించి భక్తులను మైమరపింప చేశారు. భజన కళాకారులందరూ వ్యవసాయ పనులు, ఇతర వ్యాపార పనులు చేసుకుంటూ..ప్రతిరోజు రాత్రి మూడు గంటలపాటు రామాలయంలో రాత్రి 9 గంటల నుంచి 12 గంటల వరకు భజన గీతాలను ఆలపించి తమ భక్తి భావాన్ని చాటుతున్నారు. ఈ సందర్భంగా రామాలయ కమిటీ చైర్మన్ శ్రీ జీ వీ రమణ నిత్య భజన కళాకారులకు సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భజనలు అనేవి మానసిక ఉల్లాసానికి, భక్తి భావాలకు, ఆధ్యాత్మికతకు ప్రతీకగా నిలుస్తాయన్నారు. భజన కళాకారులు తమ కళ అంతరించి పోకుండా భావితరాలకు అందించాలన్నారు. కళాకారులందరినీ ప్రజల సమక్షంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సీతారామ భజన మండలి బృందం, భక్తులు, గ్రామస్థులు పాల్గొన్నారు.