ఘనంగా అంతరిక్ష దినోత్సవం
చిత్రం న్యూస్,భైంసా: జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని శుక్రవారం భైంసా గోపాల్ రావు పటేల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విశ్రాంత అసోసియేట్ ప్రొఫెసర్ మేజర్ సీ హెచ్ శివప్రసాద్ పాల్గొని మాట్లాడారు. అబ్దుల్ కలాం లాంటి గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు, ఆర్యభట్ట లాంటి ప్రయోగాలు, చంద్రయాన్ వన్, టు, త్రీ, లాంటి ప్రయోగాలతో ప్రపంచంలో భారతదేశం ఎందులోనూ తక్కువ లేదని నిరూపించిన ఘనత మన శాస్త్రవేత్తలదని, ఇస్రో ఎన్నో ప్రయోగాలతో తన కీర్తిని ఇనుమడింప చేసిందన్నారు.విద్యార్థులు ఆదర్శనీయ వ్యక్తుల జీవితాలను ఎప్పటికప్పుడు చదువుతూ వారిని అనుసరిస్తూ ఉండాలన్నారు. కళాశాల ప్రిన్సిపల్ కర్రోల్ల బుచ్చయ్య మాట్లాడుతూ.. అంతరిక్ష పరిశోధనలో మన దేశం అత్యంత గర్వనీయ స్థానంలో ఉందని చంద్రయాన్ వన్ గాని మంగళ్ యాన్ గాని చంద్రయాన్ 3 గాని ప్రయోగాలు చేసి ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు. విద్యార్థులు ఎప్పటికప్పుడు సృజనాత్మకమైనటువంటి ప్రతిభను కలిగి ఉండాలని, వివిధ ఆవిష్కరణలు, ప్రయోగాలు చేస్తూ ముందు ఉండాలని రాకేష్ శర్మ ,కల్పనా చావ్లా ,సునీత విలియమ్స్, శుభాన్స్ శుక్ల లాంటి ఎందరో అద్భుతమైన అంతరిక్ష యాత్ర చేసి దేశ కీర్తిని నలు దిశల ఇనుమ డింప చేశారని అన్నారు.ఈ సందర్భంగా అంతరిక్షానికి సంబంధించి పలు ప్రదర్శనలు చేశారు. విద్యార్థులకు డ్రాయింగ్, క్విజ్, వ్యాసరచన పోటీలు నిర్వహించారు. చంద్రయాన్ విజయవంతంపై తయారు చేసిన డాక్యుమెంటరీని ప్రదర్శించారు.వివిధ పోటీలు నిర్వహించిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ రఘునాథ్, ఫిజిక్స్ అధ్యాపకులు శ్రావణ్య, రవికుమార్, విద్యార్థులు, కళాశాల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.