సమస్యల పరిష్కారమే ప్రజా దర్బార్ లక్ష్యం
*ప్రజాదర్బార్‌లో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు
చిత్రం న్యూస్, కొత్తపేట: ప్రజా సమస్యల పరిష్కారం లక్ష్యంగా ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. రావులపాలెం క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ప్రజాదర్బార్‌లో ఎమ్మెల్యే ప్రజల నుంచి వినతులు స్వీకరించి, ప్రతి సమస్యపై కూలంకషంగా చర్చించారు. ఈ సందర్భంగా పలు గ్రామాల నుండి వచ్చిన ప్రజలు తాగునీరు, రోడ్లు, విద్యుత్, హౌసింగ్, పెన్షన్లు, రేషన్ వంటి సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ప్రజల సమస్యలను తెలుసుకున్న ఎమ్మెల్యే సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా, ప్రతి వినతిని వేగంగా పరిష్కరించాలని ఆయన అధికారులను ఆదేశించారు.ఈ ప్రజా దర్బార్ లో 74 వినతులు వచ్చాయని ఎమ్మెల్యే బండారు తెలియజేశారు. వచ్చిన వినతులను త్వరగా పరిష్కరిస్తామని ఎమ్మెల్యే తెలిపారు.