నష్టపోయిన రైతులకు పరిహారం అందజేస్తాం_ డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి
చిత్రం న్యూస్,బేల ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న పంట పొలాలను ఆదిలాబాద్ జిల్లా డిసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి గురువారం కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి సందర్శించారు. మండలంలో మనియార్ పూర్, గూడ గ్రామంలో భారీ వర్షాలు, వరదలతో నీట మునిగి నష్టపోయిన పంటలను పరిశీలించి ఎంతమేరకు నష్టం వాటిల్లిందో రైతులను అడిగి తెలుసుకున్నారు. ఆరుగాలం కష్టపడి పంటలను కంటిరెప్పలా కాపాడితే భారీ వర్షాలు, వరదలకు నీళ్ళ పాలయిందని నష్టపోయిన రైతులకు పరిహారం అందించి ఆదుకోవాలని పలువురు రైతులు చైర్మన్ ని కోరారు.ఈ సందర్బంగా డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి మాట్లాడుతూ.. ప్రకృతి విపత్తు వల్ల మండలంలో వేల ఎకరాల్లో పత్తి, సోయా, కంది పంటలు చాలా వరకు దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించడం జరిగిందన్నారు. రైతులు ఎవరూ కూడా అధైర్యపడొద్దని , కాంగ్రెస్ ప్రభుత్వం మానవతా దృక్పథంతో ముందుకు వచ్చిందని చెప్పారు. వరద బాధితులకు అన్ని విధాలా సహాయం అందిస్తామని జిల్లా ఇంచార్జ్ మంత్రి జూపల్లి కృష్ణ రావ్ చెప్పారన్నారు. అయితే గతంలో ఉన్న ప్రభుత్వం భారీ వర్షాలు, వరదలకు నష్ట పోయిన రైతులకు ఎప్పుడు పరిహారం ఇవ్వలేదని కానీ ఇప్పుడు ఉన్న ప్రతిపక్ష నాయకులు రైతుల తరపున మాట్లాడం చాలా విడ్డురంగా ఉందన్నారు. త్వరలో వ్యవసాయ అధికారులతో సర్వే చేపట్టి నివేదిక అందిన వెంటనే రైతులకు పరిహారం అందజేయడం జరుగుతుందని రైతులకు భరోసా నిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ విస్తరణ అధికారి వినయ్ కుమార్,మండల మాజీ జడ్పీటీసీ రాందాస్ నాక్లే, కాంగ్రెస్ పార్టీ యూత్ అసెంబ్లీ ఉపాధ్యక్షులు సామ రూపేష్ రెడ్డి,కాంగ్రెస్ పార్టీ మండల కిసాన్ సెల్ అధ్యక్షులు ఘన్ శ్యామ్, సీనియర్ నాయకులు సంతోష్, సాగర్, విపిన్, అవినాష్, సూర్యభాన్, కరీం తదితరులు పాల్గొన్నారు.