రిజర్వాయర్ లో కోల్పోయిన భూములను పరిశీలిస్తున్న సీపీఎం జిల్లా బృందం
చిత్రం న్యూస్, ఆదిలాబాద్ బ్యూరో: పిప్పల్ కోటి రిజర్వాయర్ పేరుతో సేకరించిన 1200 ఎకరాల్లో కేవలం 180 ఎకరాలకు మాత్రమే నష్టపరిహారం చెల్లించి మిగితా 1020 ఎకరాలకు నష్టపరిహారం చెల్లించలేదని సీపీఎం జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్, సీనియర్ నాయకుడు బండి దత్తాత్రి తెలిపారు. భూనిర్వాసిత రైతులతో కలిసి బుధవారం పిప్పల్ కోటి రిజర్వాయర్ లో కోల్పోయిన భూములను పార్టీ నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్బంగా దర్శనాల మల్లేష్ మాట్లాడుతూ పిప్పల్ కోటి రిజర్వాయర్ నిర్మాణం పేరుతో 2018 సంవత్సరంలో 1200 ఎకరాల సాగుభూములను సేకరించారని,అందులో కేవలం 180 ఎకరాలకు మాత్రమే నష్టపరిహారం చెల్లించారని తెలిపారు. మిగిలిన రైతులకు నష్టపరిహారం ఎకరాకు 8 లక్షలు నిర్ణయించినప్పటికీ ఏడేండ్లు గడుస్తున్నా నష్టపరిహారం చెల్లించక పోవడంతో రైతులు ఇబ్బందులు ఎందుర్కొంటున్నారని పేర్కొన్నారు. రైతులు భూమిని సాగుచేసుకోలేక ,అమ్ముకోలేక అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం పెరిగిన భూమి విలువకు ప్రభుత్వం ఇచ్చే నష్టపరిహారం ఏ మాత్రం సరిపోదు అన్నారు.ఆ డబ్బులతో రైతులు మరో చోట భూమిని కొనుక్కోలేని విదంగా భూముల రేట్లురెట్టింపు అయ్యాయన్నారు. రిజర్వాయర్ పనులు సైతం నత్త నడకన నడుస్తున్నాయని చెప్పారు. మూడేళ్లలో పూర్తికావాల్సిన పనులు ఏడేండ్లుఅయిన పూర్తికాక పోవడం చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుందన్నారు. గత పాలకులతో పాటు ఏడాదిన్నర పూర్తి చేసుకున్న ప్రస్తుత పాలకుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తుందని ఎద్దేవా చేశారు. వెంటనే రైతులకు నష్టపరిహారం రెట్టింపు చేసి చెల్లించాలని ,రిజర్వాయర్ పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు .ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు ఆర్.మంజుల, సీఐటీయూ నాయకులు అగ్గిమల్ల స్వామి ,పండుగ పొచ్చన్న మహిళా నాయకులు అరీఫా బేగం ,గంగాసాగర్ ,గ్రామ కార్యదర్శి ధొనిపెల్లి స్వామి , రైతులు నసీరుద్దీన్ ,పెంటన్న తదితరులున్నారు .