నష్టం అంచనా వేసి సమగ్ర నివేదిక అందించాలి
*ఉమ్మడి జిల్లా ఇంఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు
చిత్రం న్యూస్, ఆదిలాబాద్ బ్యూరో: భారీ వర్షాల కారణంగా వాటిల్లిన నష్టాన్ని అంచనా వేసి సమగ్ర నివేదిక ఇవ్వాలని ఉమ్మడి ఆదిలాబాద్ ఇంఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. తాజా వర్షాలు, వరదల కారణంగా జరిగిన నష్టం, సహాయక చర్యలపై పెన్ గంగా గెస్ట్ హౌజ్ లో అధికారులతో మంత్రి సమీక్షించారు. చేపట్టాల్సిన సహాయక చర్యలపై అధికారులకు తగిన సూచనలు చేస్తూ, వరద నష్టంపై శాఖల వారీగా సమగ్రమైన నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ఆ నివేదికను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి, ఆ మేరకు నిధులు కేటాయించాలని కోరతానని తెలిపారు. ప్రత్యామ్నాయ చర్యల్లో భాగంగా వెంటనే సహాయక చర్యలు చేపట్టాలన్నారు. చెరువులు, కుంటలు, కాల్వలకు గండ్లు పడ్డ చోట యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలని సూచించారు. దెబ్బతిన్న రోడ్లకు తక్షణమే మరమ్మతులు చేయాలని, విద్యుత్ సరఫరాలో తలెత్తే సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని చెప్పారు. వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
అంతకుముందు ఇటీవల బోరజ్ మండలం తరోడా వద్ద వంతెన దాటుతూ లక్ష్మిపూర్ గ్రామానికి చెందిన లాండే దత్తు కొట్టుకుపోయి మృతి చెందడంతో ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మంజూరైనా రూ.5లక్షల చెక్కును ఆయన కుటుంబ సభ్యులకు అందించారు. అనంతరం ఆదిలాబాద్ గ్రామీణ మండలం అంకోలి, తంతోలి గ్రామాల్లో వర్షానికి దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. ఈ కార్యక్రమం లో ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, అనిల్ జాదవ్, వెడ్మ బొజ్జు,ఎమ్మెల్సీ దండే విఠల్, జిల్లా కలెక్టర్ రాజర్శి షా, ఎస్పీ అఖిల్ మహాజన్, అదనపు కలెక్టర్ శ్యామలా దేవి, ట్రైనీ కలెక్టర్ సలోని చాబ్రా తదితరులు ఉన్నారు.