*భీంపూర్ మండలం పిప్పల్ కోటిలో పంటలు, ఇండ్లు పరిశీలించిన సీపీఎం బృందం
సీపీఎం జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్
చిత్రం న్యూస్, ఆదిలాబాద్, బ్యూరో: జిల్లాలో భారీ వర్షాలకు పంటలు దెబ్బతిని రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారికి ఎకరానికి రూ.50వేల చొప్పున నష్టపరిహారం అందించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్, సీనియర్ నాయకులు బండి దత్తాత్రి డిమాండ్ చేశారు. మంగళవారం భీంపూర్ మండలం పిప్పల్ కోటి గ్రామంలో నీట మునిగిన పంటలు, దెబ్బతిన్న ఇండ్లను పార్టీ నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. గ్రామంలో ఇప్ప సంతోష్ అనే కౌలు రైతు 14 ఎకరాల భూమిలో 25 పత్తి సంచుల విత్తనాలు వేశారని, ఇప్పటివరకు ఐదు లక్షల యాభై వేల రూపాయలు పెట్టుబడి పెట్టారని తెలిపారు. పంట చేతికి వస్తే పదమూడు లక్షల రూపాయలు వరకు దిగుబడి వచ్చేదని పేర్కొన్నారు. భారీ వర్షాల కారణంగా పూర్తిగా నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. మరో రైతు తొనుపు స్వామి నాలుగు ఎకరాల్లో పత్తి పంట సాగు చేయగా పూర్తిగా నీట మునిగిందన్నారన్నారు.ఇలా పిప్పల్ కోటిలో రెండు వందల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి వెంటనే ఎకరాకు యాభై వేల రూపాయలు నష్టపరిహారం చెల్లించి రైతులను ఆదుకోవాలన్నారు. గ్రామంలో ఇండ్లలోకి నీరువచ్చి నష్టపోయిన బాధిత కుటుంబాలను ఇంటింటికీ తిరిగి పరామర్శించామని పేదల తిండిగింజలు, నిత్యావసర సరుకులు నీట మునిగి నష్టపోవడమే కాక ఇండ్లు దెబ్బతిన్నాయని తెలిపారు. కొందరి ఇండ్లు కూలిపోయాయని వివరించారు. వెంటనే ప్రతి కుటుంబానికి తక్షణ సహాయం కింద రూ. 25వేలు అందించాలని, అందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని స్పష్టం చేశారు. నష్టపోయిన బాధితుల జాబితాను జిల్లా కలెక్టర్ కు అందజేస్తామని బాధితులకు న్యాయం జరిగే వరకు సీపీఎం పోరాటం చేస్తుందని తెలిపారు. పార్టీ జిల్లా కమిటీ సభ్యులు ఆర్. మంజుల, మహిళా సంఘం నాయకులు గంగసాగర్, అరిఫా బేగం, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు అగ్గిమల్ల స్వామి, జిల్లా నాయకులు పండుగ పాచ్చన్న, గ్రామ శాఖ కార్యదర్శి ధోనిపెల్లి స్వామి, గ్రామస్తులు పాల్గొన్నారు.