అన్నదాతకు కన్నీటి కష్టం
*భారీ వర్షాలతో నీట మునిగిన పంటలు
*నదులు, వాగుల సరిహద్దు ప్రాంతాల్లో భారీగా నష్టం
*పలు చోట్ల కోతకు గురైన రోడ్లు, కల్వర్టులు
*నష్టాన్ని ప్రాథమికంగా అంచనా వేసిన అధికారులు
*వరద ప్రాంతాలను పరిశీలించిన ఇంఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు
చిత్రం న్యూస్, ఆదిలాబాద్ బ్యూరో: గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అతలాకుతలమైంది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో జన జీవనం అస్తవ్యస్తంగా మారింది. నదులు, వాగులు పొంగి పోర్లడంతో సమీప పంట పొలాలను వరద ముంచేత్తింది. దీంతో ఏపుగా పెరుగుతున్న పత్తి, సోయా, కంది తదితర పంటలు నీట మునిగాయి. మిగతా చోట్ల రోజుల తరబడి పంటలు నీళ్లలోనే ఉండటంతో తెగుళ్ల భారిన పడి ఎదుగలేని పరస్థితికి చేరుకోవడంతో అన్నదాతలకు తీవ్ర నష్టం వాటిల్లింది. మరోపక్క అనేక చోట్ల రోడ్లు, కల్వర్టులు తెగిపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వ్యవసాయ, పంచాయతీ రాజ్, ఆర్ అండ్ బీ శాఖల అధికారులు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి ప్రాథమికంగా నష్టాన్ని అంచనా వేశారు
అన్నదాతకు తీరని వేదన
ఉమ్మడి జిల్లాలో కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు కొన్ని చోట్ల పంటలకు మేలు జరగగా లోతట్టు ప్రాంతాల్లో మాత్రం తీవ్ర నష్టం చేకూర్చింది. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలో పెన్ గంగా నది ఉగ్రరూపం దాల్చడంతో సమీపంలోని జైనథ్, బేల, భీంపూర్, బోరజ్ మండలాల్లో వేలాది ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. వీటితో పాటు వివిధ మండలాల్లో వాగులు, వంకలు ఉదృతం గా ప్రవహించి పంట చేలలోకి వెళ్లడంతో పాటలు నీట మునిగాయి. ఒక్క ఆదిలాబాద్ జిల్లాలోనే సుమారు 11వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. మిగతా మంచిర్యాల, నిర్మల్, కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఇదే మాదిరి పంటలు నష్టపోయినట్లు తెలిసింది. పూర్తి స్థాయి సర్వే చేస్తే ఎంత మేర పంటలు నష్టపోయాయో తెలిసేందుకు అవకాశం ఉంటుంది.
రోడ్లు, కల్వర్టులకు నష్టం
భారీ వర్షాలకు పంటలతో పాటు పలు చోట్ల రోడ్లు, కల్వర్టులు వరద దాటికి తెగిపోవడంతో రూ.కోట్ల లో నష్టం జరిగింది. కొన్ని చోట్ల లో లెవల్ వంతెనలు కొట్టుకుపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కొన్ని చోట్ల లో లెవల్ వంతెనలపై నుంచి వరద నీరు ప్రవహించడంతో ఆయా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అత్యవసర పరిస్థితి లో అంబులెన్సులు కూడా వెళ్లలేని పరిస్థితి కనిపిస్తోంది. మరోపక్క ఆదిలాబాద్ పట్టణంలో శివారులో కాలనీల్లోని తట్టు ప్రాంతాల్లో ఇండ్లలోకి నీళ్లు చేరడంతో నివాసితులు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా కలెక్టర్ రాజర్శి షా, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఇతర ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి బాధితులకు స్వాంతన కలిగిస్తున్నారు. మరో రెండు, మూడు రోజులు భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరికలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. అత్యవసర పరిస్థితి ఏర్పడితే వెంటనే సమాచారం అందించాలని చెబుతున్నారు. అటు పోలీసు యంత్రాంగం సైతం అప్రమత్తం గా ఉంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టెందుకు డీడీఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచారు. తాజాగా మంగళవారం ఉమ్మడి జిల్లా ఇంఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు.