పశువులను అక్రమ రవాణా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా అరెస్టు
*నిందితులను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులు
*వివరాలు వెల్లడించిన ఎస్పీ జానకి షర్మిల
చిత్రం న్యూస్, భైంసా: నిర్మల్ జిల్లా ముధోల్ లో పశువుల అక్రమ రవాణా కేసును నిర్మల్ జిల్లా పోలీసులు చేధించారు. నిర్మల్ లోని ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ జానకి షర్మిల వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వివిధ జిల్లాల్లో మత్తు మందు ఇచ్చి గోవులను అక్రమ రవాణా చేస్తున్న అంతరాష్ట్ర ముఠా ను అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. గత కొన్ని రోజుల క్రితం ముధోల్ లో పశువు కళేబరాన్ని గుర్తించి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. భైంసా ఏఎస్పీ అవినాష్ కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం నిందితుల కోసం గాలించినట్లు తెలిపారు. నాందేడ్ కు చెందిన సయ్యద్ సోహెల్ అనే వ్యక్తి దాదాపు 40 మంది తో ముఠాగా ఏర్పడి వాహనాలలో పశువుల అక్రమ రవాణాకు పాల్పడుతున్నట్లు గుర్తించామన్నారు. ముధోల్ లో గోవులను చోరీ చేసేందుకు రాగా సీసీ కెమెరాల ఆధారంగా ఒకరిని పట్టుకొని రిమాండ్ కు తరలించడం జరిగిందన్నారు. నిందితుడు ఇచ్చిన సమాచారం మేరకు రాజస్థాన్ లోని అజ్మీర దర్గా వద్ద ఏడుగురు, బైంసాలో ఇద్దరు నిందితులను పట్టుకున్నట్లు తెలిపారు. పట్టుబడ్డ వారిలో సయ్యద్ సోహెల్, షేక్ జమీర్, షేక్ ముర్తుజా, మహమ్మద్ నజీర్, సయ్యద్ అక్రమ్, సయ్యద్ షోయబ్, సయ్యద్ ఫైజాన్, షేక్ ఉమర్, ఖలీద్ లు ఉన్నారన్నారు. వీరి వద్ద నుండి రెండు కార్లు, 8 సెల్ ఫోన్లు, 39,280 రూపాయల నగదు స్వాధీనం చేసుకొని రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు. ఎవరైనా పశువుల అక్రమ రవాణాకు పాల్పడితే తమ దృష్టికి తీసుకురావాలని పేర్కొన్నారు. నిందితులను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన పోలీసు అధికారులను ఆమె అభినందించారు.

