ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని సంస్కృతి పరిరక్షణ దినోత్సవంగా జరుపుకోవాలి _అప్పాల ప్రసాద్ జీ
*జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో అప్పాల ప్రసాద్ జీ
చిత్రం న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం: ఆగస్టు 9 ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకొని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలో కొమురం భీం ఫౌండేషన్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో ఆదివాసీలు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన సామాజిక సమరసత తెలంగాణ కన్వీనర్ శ్రీ అప్పాల ప్రసాద్ జీ కొమురం భీం విగ్రహానికి పూలమాలవేసి ఆదివాసీ జెండా ఆవిష్కరించారు. అనంతరం ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఆదివాసీ సంస్కృతి పరిరక్షణ సభ నిర్వహించి ఆదివాసీ ఆడబిడ్డలతో రక్షాబంధన్ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా అప్పాల ప్రసాద్ మాట్లాడుతూ..అమెరికా, ఆస్ట్రేలియా,న్యూజిలాండ్, కెనడా దేశాలలో ప్రకృతితో మమేకమై జీవిస్తున్న సుమారు 7 లక్షల 50వేల మంది ఆదివాసీ ప్రజలను విష ప్రయోగాలతో సామూహిక మారణకాండ జరిపి హత్య చేశారని, మిగతా అనేక పాశ్చాత్య దేశాలలో అభివృద్ధి పేరిట ఆదివాసీలపై మారణకాండ జరిపారన్నారు. ఆదివాసీలను కేవలం రెండవ తరగతి ప్రజలుగా చూశారని, ఇలాంటి దుశ్చర్యలపై ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో ఆదివాసీలు చేసిన పోరాటాల ఫలితంగా ఆగస్టు 9వ తేదీని ప్రపంచ ఆదివాసీ దినోత్సవంగా ఐక్యరాజ్యసమితి గుర్తించిందని అన్నారు. ఆదివాసీ దినోత్సవం అంటే కేవలం ఆదివాసీలు జరుపుకునే పండగ కాదని ,ఆదివాసీలు ఇచ్చినటువంటి సంస్కృతి, ఇచ్చినటువంటి అడువులు, స్వచ్ఛమైన నీరు అనుభవిస్తున్న ప్రజలందరూ జరుపుకోవాల్సిన పండగ అని అన్నారు. జల్ జంగల్ జమీన్ ఇది రాజకీయ నినాదం కాదని ఎక్కడైతే భూమి పచ్చగా ఉంటుందో, ఎక్కడైతే అడవి శాతం ఎక్కువగా ఉంటుందో. ఎక్కడైతే స్వచ్ఛమైన నీరు ప్రవహిస్తుందో అక్కడ నివసించే ప్రజలు మరియు పశుపక్ష్యాదులు సుభిక్షంగా ఉంటాయని ప్రపంచానికి చాటిచెప్పిన వారు ఆదివాసీ బిడ్డలు అని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో జీవో నెంబర్ 3 పునరుద్ధరణ చేసి గ్రామపంచాయతీలో పీసా చట్టం అమలు కచ్చితంగా అమలు అయ్యేలా చూడాలని డిమాండ్ చేశారు.
ఆదివాసీలు అంటే గవర్నమెంట్ ఆఫీసులో ఎమ్మార్వో ఆఫీసు, పోలీస్ స్టేషన్లో, ఎక్కడ కూడా విలువ ఇవ్వడం లేదు వారికి గౌరవం కల్పించేలా ప్రభుత్వం చొర చూపాలి అని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి ఐటీడీఏ నుండి వచ్చే పథకాలు ఏమేమిటో ఆదివాసీలకు తెలియటం లేదు. కాబట్టి పథకాలపై వారికి అవగాహన కల్పించాలని అలాగే పోడు భూములలో ప్రభుత్వ నుండి బోర్లు వెయ్యాలి అని కోరారు. ఆదివాసీ ఇలవేల్పుల జాతర్ల అప్పుడు జాతరకు మౌలిక సదుపాయాలు కల్పించి ప్రభుత్వమే జాతరకయ్యే ఖర్చులు భరించాలన్నారు.
ప్రతి ఆదివాసీ గ్రామాలలో ఆదివాసీలకు కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమ అనంతరం వివిధ గ్రామ పెద్దలకు , ఆదివాసీ పూజారులకు సన్మానం చేశారు.
ఈ కార్యక్రమంలో ఆదివాసీ నాయకులు తెల్లం నరసింహ రావు, ఎదలపల్లి వీరభద్రం, మాజీ ఎంపీపీ పోడం సీత, సోడే శ్రీరాములు, సిద్ధబోయిన రామ్మూర్తి, కాలం నరసింహా రావు, సామాజిక సమరసత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కీసర జైపాల్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు మన్ మోహన్ తదితరులు పాల్గొన్నారు.