బేల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తున్న ప్రజలు
లక్క పురుగులు.. భయంతో వణుకుతున్న ప్రజలు
చిత్రం న్యూస్, బేల: ఆదిలాబాద్ జిల్లా బేల మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో నిర్మించిన గోదాంలో గత రెండు సంవత్సరాల నుండి జొన్న, శనగలు ఇతర ధాన్యాలు టన్నుల కొద్ది నిల్వ ఉండడంతో లక్క పరుగుల బెడద తీవ్రమైంది. దీంతో మండల కేంద్రంలోని చుట్టుపక్కల కాలనీవాసులకు, గోదాం పక్కనే ఉన్న కేజీబీవీ పాఠశాలలో లక్కపురుగుల దాడికి జనాలు వణికిపోతున్నారు. ఇంటా బయట కుప్పలు తెప్పలుగా స్వైర విహారం చేస్తుండడంతో ఇబ్బందులు పడుతున్నారు. సాయంత్రం 5 అయ్యిందంటే చాలు కిలో మీటర్ల దూరం వరకు లక్క పురుగులు పాకుతూ కాలనీలకు చేరుతున్నాయి.దీంతో జనాలు పడుకుందామంటే మంచం నిండా అవే పాకడంతో నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. చిన్నారులు స్కిన్ ఇన్ఫెక్షన్ బారిన పడుతున్నారు. గత రెండు ఏండ్లుగా ఈ సమస్య ఉన్న అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించడంతో లక్క పురుగుల బెడద మరింత తీవ్రమౌతుంది. బుధవారం బేల మండల పోలీస్ స్టేషన్లో కాలనీవాసులు వచ్చి ఫిర్యాదు చేశారు వెంటనే గోదాం లో నిలువ ఉన్న ధాన్యాన్ని వేరే చోటకు తరలించి లక్క పురుగుల బెడదను అరికట్టాలని కాలనీ వాసులు కోరారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ మస్కే తేజరావు మాట్లాడుతూ.. చూడటానికి చిన్న సమస్య అనిపించిన ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. సాయంత్రం ఐదు అయిందంటే ప్రతి ఒక్కరిపై ఒళ్లంతా ఈ పురుగులే కనిపిస్తాయని పేర్కొన్నారు. గోదాంలో నుంచి లక్క పురుగులు బయటకు వెళ్లకుండా నిబంధనలున్న అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. వర్షాకాలం వచ్చిందంటే వీటి సమస్య పెరుగుతున్న క్రమంలో ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన అధికారులు కనీస స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యపై అధికారులు స్పందించకుంటే కాలనీవాసులతో కలిసి రోడ్డెక్కి ధర్నాలు,నిరసనలు చేపడతామని మార్కెట్ అధికారులకు హెచ్చరించారు.

