తహసీల్దార్ నారాయణకు మెమొరాండం అందజేస్తున్న టీఎస్ యూటీఎఫ్ నేతలు
చిత్రం న్యూస్, జైనథ్: ఉపాధ్యాయ, ఉద్యోగుల పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని జిల్లా కార్యదర్శి ఈ. శివన్న, మండల అధ్యక్షులు చిన్నయ్య అన్నారు. ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (USPC) ఆధ్వర్యంలో జైనథ్ మండల తహసీల్దార్ నారాయణకు మెమోరాండం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చాలా ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న ఉపాధ్యాయ సర్వీస్ సమస్యలను, ఆర్థికమైన సమస్యలను పెండింగ్లో ఉన్నందున వాటన్నిటిని తక్షణమే పరిష్కరించాలని, ప్రభుత్వ ఉద్యోగుల సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని పునరుద్ధరించాలన్నారు. అన్ని క్యాడర్ల ఉపాధ్యాయుల బదిలీలు, ప్రమోషన్ల షెడ్యూల్ ను వెంటనే ప్రకటించాలన్నారు. 5571 పీఎస్ హెచ్ఎం పోస్టులను మంజూరు చేయాలని, కొత్తగా ఏర్పడిన జిల్లాలకు డీఈవో పోస్టులను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. పీఆర్సీ నివేదికను తెప్పించుకొని వెంటనే ఉద్యోగులకు పీఆర్సీ ఇవ్వాలని, రిటైర్డ్ అయిన ఉద్యోగులకు పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలన్నారు. 317 జీవో ద్వారా నష్టపోయిన ఉపాధ్యాయులకు వెంటనే వాళ్ళ సొంత జిల్లాలకు సర్దుబాటు చేయాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ పిలుపునిచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో టీఎస్ యూటీఎఫ్ మండల అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి విఠల్, కార్యదర్శి అరె.శ్రీనివాస్, మైసా విఠల్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
