వైద్య సాక్షి (ఫైల్ ఫొటో)
పురుగుమందుతాగి డిగ్రీ విద్యార్ధిని బలవన్మరణం
చిత్రం న్యూస్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా భోరజ్ మండలం లేఖర్వాడ గ్రామానికి చెందిన డిగ్రీ విద్యార్ధిని వైద్య సాక్షి(20) రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటన మంగళవారం చోటుచేసుకుంది. ఎస్ఐ గౌతం తెలిపిన వివరాల ప్రకారం.. లేఖర్వాడ గ్రామానికి చెందిన వైద్య సాక్షి డిగ్రీ ఫైనల్ ఇయర్ చదివింది. పరీక్షలు సైతం రాసింది. ఈ నెల 21న సోమవారం రోజు తల్లిదండ్రులు అనిత, గణేష్, తమ్ముడు చరణ్ తో కలిసి వ్యవసాయ పనుల కోసం చేనుకు వెళ్ళింది. మధ్యాహ్నం అందరూ ఇంటికి వచ్చి భోజనం చేసి మళ్ళీ పొలం పనులకు వెళ్ళారు. సాక్షి మాత్రం ఇంటి పట్టునే ఉంది. 3:30 గంటల సమయంలో పురుగుమందు తాగి తమ్ముడు చరణ్ కు ఫోన్ చేసి చెప్పింది. ఇంటికి వచ్చిన చరణ్ అక్క వాంతులు చేసుకోవడంతో విషయాన్ని తండ్రి గణేష్ కు చెప్పాడు. ఇద్దరూ వచ్చి పురుగు మందు ఎందుకు తాగావని అడగ్గా నేను మీతో పాసయ్యానని అబద్ధం చెప్పాను. డిగ్రీ సెమిస్టర్లో రెండు సబ్జెక్టులు ఫెయిల్ అయ్యానని, మీరేమన్న అంటారేమో అని పురుగుమందు తాగానని చెప్పింది. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను కుటుంబీకులు వెంటనే 108 అంబులెన్స్ లో రిమ్స్ హాస్పిటల్ కు తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు సాక్షి మృతి చెందిందని, ఆమె తండ్రి గణేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్ఐ గౌతం తెలిపారు.
