పొచ్చర సబ్‌సెంటర్ తనిఖీ చేసిన డీఎంహెచ్ఓ నరేందర్ రాథోడ్
*అర్హతకి మించి వైద్యం చేసిన ఆర్ఎంపీ క్లినిక్ సీజ్
చిత్రం న్యూస్, బోథ్ :ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని పొచ్చర గ్రామ సబ్‌సెంటర్‌ను జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీలో జిల్లా మలేరియా నివారణ అధికారి డాక్టర్ ఎం. శ్రీధర్, స్థానిక మెడికల్ ఆఫీసర్ డాక్టర్ నవీన్ రెడ్డి పాల్గొన్నారు. సబ్‌సెంటర్‌లో రికార్డులను పరిశీలించిన అధికారులు సిబ్బందికి పలు సూచనలు చేశారు. విధులకు కచ్చితంగా సమయానికి హాజరుకావాలన్నారు. అన్ని రికార్డులను సరిగ్గా నిర్వహించాలని, సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించడం, ప్రతి శుక్రవారం డ్రై డే నిర్వహించడం వంటి అంశాల్లో చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. ఈ సందర్భంగా అధికారులు గ్రామ ప్రజలతో మాట్లాడారు. మలేరియా, డెంగ్యూ వంటి సీజనల్ వ్యాధుల నివారణపై వివరించారు. ప్రభుత్వ దవాఖానలను వినియోగించుకోవాలని, అర్హత కలిగిన వైద్యుల వద్దే వైద్యం పొందాలని సూచించారు. అనధికారంగా పనిచేస్తున్న ఓ ఆర్ఎంపీ క్లినిక్‌ను సీజ్ చేశారు. అనధికార వైద్యులు ఎక్కువగా నొప్పి ఇంజెక్షన్లు, స్టెరాయిడ్లు, యాంటీబయాటిక్స్ వంటి మందులు వినియోగించటం వల్ల కిడ్నీ ఫెయిల్యూర్ వంటి తీవ్రమైన సమస్యలు వస్తున్నాయ ని అధికారులు తెలిపారు. ఆర్ఎంపీలకు కేవలం ప్రాథమిక వైద్యం (ఫస్ట్ ఎయిడ్) మాత్రమే అనుమతించబడిందని, ఆ దాటితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
